వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయాలి మంత్రి కే. తారకరామారావు

వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయాలి మంత్రి కే. తారకరామారావు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: గ్యారంటీ, వారంటీ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయాలని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు
పిలుపునిచ్చారు. శనివారం వైరా, ఖమ్మం , భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పర్యటనలో అభివృద్ధి, శంకుస్థాపన పలు సభల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ ఖమ్మం చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొణిజర్ల మండలం గుబ్బగుర్తి లో ఎర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఈ ప్రాంత రైతులు సద్వినియొగం చేసుకొని, ఆర్థికంగా పైకి ఎదగాలన్నారు. బీఆర్ ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు మారుతున్నాయని పార్టీ నేతలు , కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పదవి వస్తే ఒక రకంగా లేదంటే మరో రకంగా వ్యవహరిస్తూ కేసీఆర్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పరోక్షంగా కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించక పోయినప్పటికీ వైరా సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ మారలేదని అభినందించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి రెడ్డి , వద్దిరాజు రవిచంద్ర, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు మంత్రి కేటీఆర్ పర్యటన పాల్గొన్నారు. మరోవైపు మంత్రుల పర్యటన సందర్భంగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొందరు నాయకులను గృహ నిర్బంధం
చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ నేతలపై దృష్టి సారించారు.