బీసీల సంక్షేమానికి పెద్దపీట - మంత్రి మల్లారెడ్డి

బీసీల సంక్షేమానికి పెద్దపీట - మంత్రి మల్లారెడ్డి

ముద్ర ప్రతినిధి, మేడ్చల్ :  వెనుక బడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వీరు ఆర్థికం గా ఎదిగేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులకు ప్రభుత్వం చేయూతనిచ్చేందుకు ఇస్తున్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకానికి సంబంధించిన చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.వారు చేసే వృత్తికి సంబంధించిన ఆధునిక పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకొని ఉపాధి అవకాశాలను పెంపొందించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల ఆర్థికాభివృద్ధికై  అనేక పథకాలు ప్రవేశపెట్టారని అందులో దళితుల కోసం దళితబంధు, గొల్లకుర్మలకై మేకలు, గొర్రెలు అందించడం, మత్స్యకారులకు దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకునేలా వ్యాన్లు, ద్విచక్ర వాహనాలతో పాటు పనిముట్లను సైతం అందించారన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుక్షణం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పరితపిస్తుంటారని దేశంలోనే బెస్ట్ సీఎం కేసీఆర్ అని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి కేశూరామ్, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు సంంధిత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.