- పురాతన నగరాన్ని ప్రపంచ స్ధాయికి చేర్చుతాం
- హైదరాబాద్ ను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం
- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో మంత్రి ఉత్తమ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా, ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. మంగళవారం మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసిసి)లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2025లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం యొక్క భవిష్యత్తు కోసం బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, రియల్ ఎస్టేట్ రంగానికి చురుకైన మద్దతుపై దృష్టి సారించామన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కోలుకుందన్న ఆయన పెద్ద బూమ్‌కి చేరుకుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి పునాదికి గత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలే కారణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం,మెట్రో రైలు,కృష్ణా,గోదావరి నదుల నుంచి తాగునీటి సరఫరా వంటి విజయాలు భారతదేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ ఆవిర్భావానికి దోహదపడిన మైలురాళ్లన్నారు. త్వరలోనే హైదరాబాద్ బలీయశక్తిగా ఎదుగుతోందనీ, పెట్టుబడిలో ప్రపంచ గమ్యస్థానంగా గుర్తించబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, నగరం అంతటా కనెక్టివిటీని మెరుగుపరచడానికి మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందనన్నారు. అదనంగా ఐటీ, తయారీ, నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు అత్యంత శిక్షణ పొందిన మానవశక్తిని అందించడానికి గ్లోబల్-స్టాండర్డ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ పట్టణ అభివృద్ధితో పోల్చదగిన అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు.