భారీ వర్షాలకు అతలాకు తలమవుతున్న ప్రజానీకానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మందుల సామెల్

భారీ వర్షాలకు అతలాకు తలమవుతున్న ప్రజానీకానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మందుల సామెల్
  • జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పలు శాఖల అధికారులతో కలిసి నియోజకవర్గంలోని పలు చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే
  • వరద నీటితో పొంగిపొర్రుతున్న చెరువులు కుంటల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే
  • గ్రామీణ ప్రాంతాలు తండాలలో వైద్యాధికారులు విషజ్వరాలు ప్రబలకుండా చూడాలని ఆదేశించిన ఎమ్మెల్యే
  • వెంపటి గ్రామంలో భారీ వర్షాలకు కూలిన ఇండ్లు
  • వరద ప్రవాహాల్లో పర్యటించి తగు చర్యలు తీసుకున్న తుంగతుర్తి సీఐ, ఎస్ఐలు

తుంగతుర్తి ముద్ర:- గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎట్టకేలకు ఆదివారం రాత్రి నుండి కొంతమేర తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు .తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు అన్ని చెరువులు కుంటలు వాగులు, వంకలు వరద నీటి ప్రవాహాలుగా కనిపించాయి.  నిండుకుండల్లా మారి ప్రమాదపు అంచులకు చేరుకున్న పలు చెరువులను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ లు పరిశీలించారు. పసునూరు గ్రామంలో వరద నీటితో నిండిన చెరువును పరిశీలించి చెరువుకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు .అలాగే కొత్తగూడెం, గుమ్మడవెల్లి గ్రామాల్లోని ఎస్సీ కాలనీలోకి వరద నీరు రావడం పట్ల అధికారులను అప్రమత్తం చేశారు .

అదేవిధంగా నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువు అయిన రుద్రమ చెరువు అలుగు పోస్తున్న తీరుకు అటు రైతులు శాసనసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు .వర్షం వల్ల వెంపటి గ్రామంలో పలువురి ఇల్లు కూలడం తో బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొత్తగూడెం గ్రామంలో చెరువు వరద నీటితో నిండి ప్రవాహ ఉధృతి ఎక్కువగా కావడంతో గండి పడే అవకాశం ఉండడంతో స్పందించిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ కిషన్ రావు తుంగతుర్తి ఎస్సై ఏడుకొండలు సిఐ శ్రీను నాయక్ సహాయంతో ప్రజలను అప్రమత్తం చేసి అలుగు వద్ద కొంతమేర తొలగించడంతో చెరువుకు ముప్పు తప్పింది. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల చెరువుల స్థితిగతులను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తమయ్యారు.

తుంగతుర్తి పోలీస్ అధికారులు పొంగిపొర్లుతున్న వాగులు వంకల వద్ద ప్రజలు వాగులలోకి వెళ్లకుండా వాహనాలను అడ్డంపెట్టి తగు చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు వరద విషయంలో అప్రమత్తమయ్యారు .సుమారు దశాబ్దన్నర కాలం క్రితం ఇలాంటి వర్షాలు కురిసాయని తిరిగి ఇప్పుడే చూస్తున్నామని రైతులు ప్రజలు చెబుతున్నారు. ఒకేరోజు ఒకేసారి సుమారు 500 చెరువులు అలుగులు పోయడం నియోజకవర్గం ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మందుల సామెల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవులు ప్రజలను అప్రమత్తం చేశారు .భారీ వర్షాలతో ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు. వరద ప్రవాహాల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు పర్యటించరాదని సూచించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యాధికారులను అప్రమత్తంగా ఉండాలని గ్రామీణ ప్రాంతాలు తండాలలో ఎప్పటికప్పుడు పర్యటించి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని సూచించారు .ఏది ఏమైనా కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు నిండడంతో యావత్ ప్రజలు రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తుంది.