అదానీ ఆర్థిక అరాచకం వెనుక మోడీ: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

అదానీ ఆర్థిక అరాచకం వెనుక మోడీ: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
modi behind adani says CPI State Secretary Koonanni

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: భారతదేశంలో అనతికాలంలోనే ఆర్థికంగా ఎదిగి ఆర్థిక అరాచకం సృష్టిస్తున్న అదానీ వెనుక ప్రధాని మోడీ ఉన్నారని మొత్తం అదానీ వ్యవహారానికి సంబంధించి విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ధనాన్ని అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టేలా మోడీ ప్రోత్సాహించారని అదానీని అరెస్టు చేసి విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఆదివారం ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సాంబశివరావు మాట్లాడుతూ అదానీ సంపాదన, ఆర్థిక ఎదుగుదల అంతా డొల్ల అని తేలిపోయిందని సత్యం రామలింగరాజు కంపెనీల మాదిరి అదానీ కంపెనీల వ్యవహారం నకలుగా మారిందన్నారు. 


బిఆర్ఎస్ కు అంశాల వారీ పొత్తు మాత్రమే ఉంటుందని పొత్తు పొత్తే పోరాటం పోరాటమేనన్నారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే మౌనంగా ఉన్న అధికార యంత్రాంగం పేదలు అక్రమిస్తే అనవసర కేసులు పెడుతున్నారని 123(బి) లాంటి కేసులు నమోదు చేయడం సహేతుకం కాదన్నారు. పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ఆలోచనలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని, ఆర్టీసి, పోడు సమస్యలను కూడా పరిష్కరించాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. డబ్బుతో అరాచకం సృష్టించాలనుకునే వారికి ప్రజలే తగు సమాధానం చెబుతారన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.