ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్‌

దేశ రాజధాని దిల్లీ లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్‌  ఆరుగుర్ని బలితీసుకుంది.  ఆ కాయిల్‌ కారణంగా మంటలు చెలరేగి, ఆ తర్వాత వెలువడిన విషపూరిత వాయువులను  పీల్చడంతో ఊపిరాడక ఒకే కుటుంబంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉండటం మరింత విచారకరం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య దిల్లీలోని శాస్త్రి పార్క్‌ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసముంటోంది. గురువారం రాత్రి దోమలను తరిమేందుకు వీరు మస్కిటో కాయిల్‌ను అంటించి పడుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఈ కాయిల్‌  పరుపుపై పడి మెల్లిగా అంటుకుని పొగ అలుముకుంది. అటు కిటికీలు, తలుపులు కూడా పూర్తిగా మూసి ఉన్నాయి. పరిస్థితిని గమనించి వారు బయటపడేందుకు ప్రయత్నించినా విషపూరిత వాయువులను పీల్చి వారు స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో మొత్తం 9 మంది ఉండగా.. వీరిలో ఆరుగురు విగతజీవులుగా కన్పించారు. మిగతా ముగ్గురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ''రాత్రంతా విషవాయువులు పీల్చడంతో వారు స్పృహతప్పి పడిపోయారు. ఆ తర్వాత ఊపిరాడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు'' అని స్థానిక పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి కూడా ఉంది.