మలుపులు తిరుగుతున్న నేపాల్‌

మలుపులు తిరుగుతున్న నేపాల్‌

నేపాల్‌  రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ మధ్య పొత్తులు కుదరలేదు. పీఎం పీఠంకోసం పలు పార్టీలు పట్టుబట్టడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆదివారం ఆ సంక్షోభానికి తెరపడిరది. ఆరు రాజకీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి సీపీఎన్‌` మావోయిస్టు సెంట్రల్‌ చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌  ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నారు. అయితే ప్రచండ కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పీఎంగా బాధ్యతలు చేపడతారు. ఆ తరువాత మరో పార్టీ నేత పీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.ఆరు పార్టీల మధ్య ఒప్పందం జరిగిన తరువాత ప్రచండ ఆదివారం సాయంత్రం నేపాల్‌ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి వద్దకు వెళ్లారు. 169 మంది ఎంపీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతిఇవ్వాలని కోరారు. కొద్దిసేపటికే రాష్ట్రపతి ప్రచండ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఆమోదం తెలిపింది.పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ) 1954 డిసెంబర్‌ 11న పోఖారా సవిూపంలోని కస్కీ జిల్లా ధికుర్‌ పోఖారీలో జన్మించారు. సీపీఎన్‌ ? మావోయిస్టు లో దశాబ్ద కాలంపాటు సాగిన సాయుధ తిరుగుబాటు మార్గాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే పుష్ప కమల్‌ దహల్‌ రెండు సార్లు నేపాల్‌ ప్రధానిగా పనిచేశారు.  30 రోజుల్లో విశ్వాస ఓటింగ్‌లో నెగ్గిన తరాతనే ప్రచండ ప్రభుత్వానికి శాశ్వత అధికారం లభిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో నేపాల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలోని పాలక కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకొన్నది. నేపాల్‌ కాంగ్రెస్‌తో పాటు ప్రచండ పార్టీ కూడా భాగస్వామిగా వున్న ఈ కూటమిలో ముందుగా ఎవరు ప్రధాని కావాలనే అంశంపై ఏకీభావం కుదరకపోడంతో ప్రచండ వాకౌట్‌ చేసి ప్రతిపక్ష సిపిఎన్‌ (యుఎంఎల్‌)తో పొత్తు కుదుర్చుకొన్నారు.

ప్రధాని పదవిని ముందుగా తనకు ఇవ్వాలని దేవ్‌బా పట్టుపట్టడంతో కూటమిలో చీలిక వచ్చింది. కేవలం 32 స్థానాల సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) అధినేత ప్రధాని పదవిని చేజిక్కించుకొన్నారు. ఈ ఏర్పాటుకు సిపిఎన్‌ (యుఎంఎల్‌) అధినేత ఓలి అంగీకరించడం విశేషం. 275 స్థానాలున్న నేపాల్‌ పార్లమెంటులో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు, 110 స్థానాలకు దామాషా పద్ధతి ఎన్నికలు జరుగుతాయి. 165 ప్రత్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు దేశాన్ని పాలించిన కూటమిలోని ప్రధాన పక్షం నేపాల్‌ కాంగ్రెస్‌ 57 సీట్లను గెలుచుకోగా, ప్రతిపక్ష సిపిఎన్‌ (యుఎంఎల్‌) 44 స్థానాల్లో గెలుపొందింది.దామాషా స్థానాలు కలుపుకోగా నేపాలీ కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దాని తర్వాతి స్థానం 77 సీట్లతో ప్రతిపక్ష సిపిఎన్‌ (యుఎంఎల్‌)కు దక్కింది. మూడవ స్థానంలో 32 సీట్లతో ప్రచండ పార్టీ నిలిచింది. అధికార కూటమిలో వున్న నేపాలీ కాంగ్రెస్‌, సిపిఎన్‌(యుఎంఎల్‌)కు స్పష్టమైన మెజారిటీ రాకపోడంతో బేరసారాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రచండ పార్టీ అధికార కూటమి నుంచి బయటపడి ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్‌) తో కలిసింది. దీనితో నేపాల్‌లో ఐక్య కమ్యూనిస్టు కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమిలో ఇంకా ఆర్‌ఎస్‌పి (20), ఆర్‌పిపి (14), జెఎస్‌పి (12), జనమత్‌ (6), నాగరిక్‌ వున్ముక్తి (3) పార్టీలు వున్నాయి.ఈ కూటమి మొత్తం బలం 168. ఇందులో సిపిఎన్‌ (యుఎంఎల్‌)కు ప్రచండ పార్టీ బలం కంటే రెట్టింపుకి పైగా స్థానాలు వున్నందున ఈ ప్రభుత్వం సుస్థిరత అనుమానాస్పదంగానే వుంటుంది. రెండు కమ్యూనిస్టు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రచండ తొలి రెండున్నరేళు, సిపిఎన్‌(యుఎంఎల్‌) అధినేత కెపి శర్మ ఓలి చివరి రెండున్నరేళ్ళు ప్రధానులుగా వుంటారు.

కొత్త అధికార కూటమిలోని రెండు కమ్యూనిస్టు పార్టీలు చైనాకు సన్నిహితంగా వున్న చరిత్ర కలిగినవి. అందుచేత భారత దేశంతో కొత్త నేపాల్‌ ప్రభుత్వం సంబంధాలు ఎలా వుంటాయనేది సందేహాస్పదమే. భారత చైనాలతో సమాన దూరంలో వుంటూ కథ నడిపించుకు రావడం కొత్త ప్రభుత్వానికి సమస్యాత్మకమే అవుతుంది. గతంలో ప్రధానిగా వున్నప్పుడు శర్మ ఓలి భారత దేశం నుంచి బహు దూరమయ్యారు.భారత భూభాగాలుగా వున్న లిపులెఖ్‌, కాలాపాని, లింపియాధుర ప్రాంతాలను నేపాల్‌కు చెందినవిగా ప్రకటించి తీవ్ర వివాదాన్ని సృష్టించారు. ఆ వివాదం తిరిగి బలం పుంజుకొనే ప్రమాదం లేకపోలేదు. దేవ్‌బా అధికారంలో వుండగా భారత చైనాలకు సమ దూరంలో వుంటూ నేపాల్‌ రాజకీయాలను చాకచక్యంగా నడిపించారనిపించుకొన్నారు. ఇప్పుడు దానికి బ్రేకు పడుతుందేమో చూడాలి. ఈసారి నేపాల్‌ ఎన్నికలు కొత్త శక్తులను ముందుకు తీసుకు వచ్చాయి. అక్కడి రాజకీయాల్లో బలం పుంజుకొంటున్న యువశక్తి పాత పార్టీల నత్త నడక ధోరణిని నిరసిస్తున్న సంగతిని రుజువు చేశాయి.ఇది కొత్తగా ఏర్పడిన ఆర్‌ఎస్‌పి 20 స్థానాలు గెలుచుకోడంలో రుజువైంది. టెలివిజన్‌ యాంకర్‌గా ప్రసిద్ధి గాంచిన రబి లమిచానే కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌పి యువతరానికి ప్రాతినిధ్యం వహించింది. ఇక ముందు భారత, చైనాలు రెండిరటికీ దూరంగా వుంటూ నేపాల్‌ స్వతంత్ర పంథాను ఎంచుకోవాలని యువత ఆశిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. కేవలం భూ సరిహద్దులే వున్న నేపాల్‌, ఎక్కువగా భారత దేశంపై ఆధారపడి వుండాలి. దానికి అవసరమైన దిగుమతులు ఇండియా నుంచి గాని, ఇండియా విూది నుంచి గాని మాత్రమే చేరవలసి వుంది.

ఈ నేపథ్యంలో ప్రచండ నాయకత్వంలోని కొత్త కూటమి ప్రభుత్వం అడుగులు ఎటుపడతాయోనన్నది ఆసక్తిదాయకం.2008 ఎన్నికల్లో సీపీఎన్‌ ? మావోయిస్టు పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ సమయంలో ప్రచండ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2009 మే 4 ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తిరిగి 2016` 2017 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. సోమవారం మూడోసారి ఆయన నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఆయన పూర్తికాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించ లేకపోయారు. ఈసారికూడా రెండున్నరేళ్లు మాత్రమే ప్రధానిగా ఒప్పందం మేరకు సోమవారం ప్రచండ ప్రమాణ స్వీకారం చేస్తారు.