తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి వసతులు మాత్రం శూన్యం

తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి వసతులు మాత్రం శూన్యం
  • వైద్యశాలకే వైద్యం అందించాలంటూ ఉన్న ప్రజలు
  • కనీసం ఆక్సిజన్ సిలిండర్ కూడా లేని తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి
  • ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చిన ప్రభుత్వ సిబ్బంది
  • ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండానే బస్సు వెళ్ళిపోతుందని బస్సు కోసం పరిగెత్తిన సిబ్బంది
  • ఆశ వర్కర్ వారించిన ఫలితం శూన్యం
  • తుంగతుర్తి ఆసుపత్రిలోనే రావులపల్లి పిహెచ్సి నిర్వహణ
  • టాయిలెట్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న ఏఎన్ఎంలు
  • తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారు తెలియదంటున్న ప్రజలు
  • శనివారం పాప మృతి ఘటనకు బాధ్యులు ఎవరు?
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

తుంగతుర్తి ముద్ర:-పేరుకే పెద్ద ఆసుపత్రి ......వసతులు మాత్రం శూన్యం..,.. పెద్ద ఆసుపత్రికి పెద్ద వైద్యం చేయాలంటున్న తుంగతుర్తి ప్రజానీకం....... తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 30 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. ఆసుపత్రి నిర్మాణం అనంతరం ప్రారంభ కాలం నుండి సుమారు దశాబ్దన్నర కాలం వరకు ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది ,రోగులతో కిటకిటలాడింది.. పేద ప్రజానీకానికి ప్రభుత్వ వైద్యం అందింది . కాలక్రమేణా డాక్టర్లు బదిలీలపై వెళ్లడం సిబ్బంది సైతం వెళ్లిపోవడం జరిగింది .ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ నివాసాలు, సిబ్బంది నివాసాలు ,శిథిలావస్థకు చేరుకున్నాయి .క్రమంగా ఆసుపత్రి బాగోగులు పట్టించుకునే నాధుడే లేడని మాట సర్వత్రా వినవస్తుంది.ఆసుపత్రిలో సిబ్బంది, డాక్టర్లు కేవలం రిజిస్టర్లలో పేర్లకు మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప విధులకు హాజరు కావడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి తేవడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మరింతగా పెరిగిందని మాట సర్వత్ర వినవస్తుంది. తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి లోనే రావులపల్లి పిహెచ్సి సైతం నిర్వహిస్తున్నారు .సిబ్బందికి కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్స్ ను పిహెచ్సి సిబ్బంది వినియోగించు కోకుండా సిహెచ్సి సిబ్బంది తాళాలు వేసుకుంటున్నారని సమాచారం దీంతో రావులపల్లి పీహెచ్సీ మహిళా ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం పిఎస్సి సిబ్బంది మందులు అడిగిన ఇవ్వరని లెటర్లు తీసుకురమ్మంటారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సూర్యాపేట నుండి వచ్చి పోతుంటారని ఉదయం 11 గంటలకు వచ్చి సాయంత్రం మూడు గంటల వరకే వెళ్లిపోతారని తెలుస్తోంది. ఎవరి ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తారని ఎవరికి వారే యమునా తీరే చందంగా ఆస్పత్రి పరిపాలన ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. కనీసం ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ కూడా లేదని సమాచారం  .ఇటీవలనే పాముకాటుతో దూర గ్రామం నుండి వచ్చిన వ్యక్తికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఇదేమని ప్రశ్నించిన ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగానే జవాబు ఇచ్చారని తెలుస్తోంది .ఆస్పత్రి పై నియంత్రణ సక్రమంగా లేదని సిబ్బందితో సక్రమంగా విధులు నిర్వహింప జేసే విధి నిర్వహణలో లోపం కొట్ట వచ్చినట్లు కానవస్తుందని అధికారులు ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మాట సర్వత్రా వినిపిస్తోంది .కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని పాలకులు చెబుతుండగా అది నేతి బీరకాయలలో నెయ్యి మాదిరిగానే ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు ఉచిత ప్రసూతి సౌకర్యం కల్పించామని అందుకు అనుగుణంగా వసతులు కల్పించామని చెబుతున్నారు. కానీ తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి చేయాల్సిన గైనకాలజిస్ట్ డాక్టర్ లేరు. ఉన్న డాక్టర్ డిప్యూటేషన్ పై వచ్చారని తెలుస్తోంది. కనీసం ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం అందుబాటులో లేదని తెలుస్తోంది.

  • డాక్టర్ లేకుండానే కాన్పులు.....

తుంగతుర్తి ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ప్రసూతి డాక్టర్ లేకుండానే స్టాఫ్ నర్స్ లే కాన్పులు నిర్వహించారని అందులో శ్రీలత అనే మహిళ కాన్పు వికటించి బిడ్డ మరణించిన విషయం విధితమే .కాగా మరో విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది .మరో మహిళకు ఉదయం కాన్పు నిర్వహించిన స్టాఫ్ నర్సులు కాన్పు సమయంలో చిన్న సర్జరీ నిర్వహించారని తమకు బస్సు టైం అవుతుందని కుట్లు వేయకుండానే వెళ్లిపోయారని సమాచారం .సంబంధిత ఆశా వర్కర్   ప్రశ్నించిన మీ ఊరిలో బస్సులు దొరకవని డ్యూటీకి వచ్చే సిస్టర్లు వేస్తారు లే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది .ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బంది తీరు పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు  .ఉదయం ఆరు గంటలకే ప్రసూతికి వచ్చిన మహిళ పరిస్థితి తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఒంటిగంట వరకు ఆసుపత్రిలోనే ఉంచి ప్రసూతి చేయడం ఎలాగో తెలియక ప్రైవేట్ డాక్టర్ రప్పించడం డాక్టర్ సైతం తల భాగం బయటకు వచ్చిందని తాను ఏమీ చేయలేనని కనీసం ఆక్సిజన్ అన్న పెట్టమని చెప్పినట్లు తెలిసింది. ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో సదర్ ప్రైవేట్ డాక్టర్ మానవతా దృక్పథంతో తన ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చినట్లు తెలుస్తోంది  .అనంతరం పాపను బయటకు తీసిన సిబ్బందిపాప కదలడం లేదని చెబుతూ సూర్యాపేటకు తీసుకువెళ్లాల్సిందిగా తెలిపినట్లు సమాచారం.ప్రభుత్వ ఆంబులెన్స్ సైతం లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రి ఆంబులెన్స్ లో పాపను సూర్యాపేటకు తీసుకు వెళ్లినట్టు సమాచారం. కాగా పాప బరువు  సుమారు నాలుగు కేజీలు ఉందని అలాంటప్పుడు ప్రసూతి కాని పక్షంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి ఉండగా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే పాప మృతి చెందిందని బంధువులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం పాప ప్రాణం ఖరీదు గా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలు సక్రమంగా లేవని ఇంకా వంద పడకల ఆసుపత్రి ఎలా చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు .ముందుగా అది నిర్మాణం అయ్యేవరకు అన్న ఆస్పత్రిలో చాలినంతమంది సిబ్బందిని ,డాక్టర్లను ఏర్పాటు చేయాలని ఉన్న సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించేలా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఆజమాహిషి చేయాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావని ప్రజలు అంటున్నారు. ముందుగా తుంగతుర్తి పెద్ద ఆసుపత్రికి మంచి వైద్యం అందించాలని అధికారులను ,ప్రజాప్రతినిధులను ప్రజలు కోరుతున్నారు.