కులవృత్తి చేసెటోళ్లకు  రూ. లక్ష సాయం

కులవృత్తి చేసెటోళ్లకు  రూ. లక్ష సాయం
  • జూన్​9 నుంచి కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం 
  • మంచిర్యాలలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • అదేరోజు అన్ని  నియోజకవర్గాల్లో పంపిణీ

ముద్ర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుడుతోంది. వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా చేతివృత్తులు, కులవృత్తుల వారికి  రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. జూన్​తొమ్మిదిన దీనిని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. దీనికి మంచిర్యాల జిల్లా వేదిక కాబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా దీనిని ప్రారంభిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలతో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ ను ఏర్పాటు చేసింది. దీనిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మంగళవారం ప్రారంభించారు. విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి తదితర కులవృత్తులు, చేతివృత్తుల‌నే నమ్ముకొని జీవిస్తున్న వారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని గ‌త నెల‌లో జ‌రిగిన‌ కేబినెట్‌లోనే నిర్ణయించారు. విధివిధానాలను వేగంగా రూపొందించి లబ్ధిదారులను ఎంపిక చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో  https://tsobmmsbc.cgg.gov.in అనే సైట్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. తదనంతరం జాబితా తయారవుతోంది.