అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు

అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు
  • మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మున్సిపాలిటీ అభివృద్ధి
  • అవగాహన లేకుండా కాంగ్రెస్ కౌన్సిలర్ల ఆరోపణలు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సూర్యాపేట శాసన సభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సూర్యాపేట మున్సిపాలిటీ ని అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉందని మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ అన్నారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

సుందరికరణ కోసం ఉపయోగించే మొక్కలు నర్సరీలో పెంచేందుకు అవకాశం లేకపోవడంతో బయట నుండి తెప్పించి సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కొరకు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక  ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి ఇంటింటికి నీటిని అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనిదని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ హయాంలో  మూసీ మురికి నీరు తాగించిన  పరిస్థితి ఉండగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణ నీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

సాంకేతిక సమస్యలతో ఎక్కడైనా నీటి సరఫరా అంతరాయం ఏర్పడితే వాటిని అధికారులు తక్షణమే సమస్య పరిష్కారం  చేస్తున్నారని తెలిపారు. దాన్ని పట్టించుకోకుండా ఎన్నికలు దగ్గరకు వస్తుండడంతో అభివృద్ధి చూసి ఓర్వలేక  వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని దూరలోచనతో కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరుపున ఖండిస్తున్నట్లు తెలిపారు.