గోదావరికి వరద పోటు

గోదావరికి వరద పోటు
  • ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేసిన అధికారులు
  • గోదావరి ఒడ్డున మాతా శిశు ఆసుపత్రి రోగుల తరలింపు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ఇన్ పేషేంట్ లను, వారి సహాయకులను సురక్షితమైన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గోదావరి ఒడ్డున మాతా శిశు కేంద్రం ఉండడంతో గోదావరి వరద ఉధృతికి ఆసుపత్రి మునిగే ప్రమాదం ఉందని గమనించారు. శుక్రవారం వైద్య అధికారులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా గర్భిణీలు, నవజాత శిశువులు, వారికి సహాయంగా వచ్చిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లలో తరలించారు. ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరికి వరద పోటు పెరిగింది. ధీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను నీటి పారుదల శాఖ అధికారుల ఆదేశాలతో ఎత్తివేశారు. దిగువ భాగంలో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మాతా, శిశు ఆసుపత్రిలో కి నీరు చేరుకునే ప్రమాదం ఉంది. గత ఏడాది కూడా మాతా శిశు ఆసుపత్రి భవనంలోకి వరద నీరు చేరుకుని మునిగింది. ఆసమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఎమ్మెల్యే దివాకర్ రావు, వైద్య అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. ముంపు ఉందని తెలిసి కూడా ఆసుపత్రిని అక్కడ ఏర్పాటు చేసి కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం చేశారని విపక్షాలు ఆరోపించాయి. ఆసుపత్రి వరద ముంపుకు గురయ్యాక ఆసుపత్రిలోని విలువైన సామాగ్రి నీటి పాలైంది. వరదకు పాములు కొట్టుకువచ్చి భయానకంగా మారింది.

రోగుల తరలింపులో పార్టీల పోటీ

మాతా శిశు ఆసుపత్రిలోని రోగులను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు లో బీఆరెస్, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు పోటీ పడ్డారు. గత ఏడాది వరద వచ్చినప్పుడు కాంగ్రెస్ నేతలు రోగుల తరలింపులో సాయపడ్డారు.   అధికార పక్ష నేతలు సహాయం చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి ఆ విమర్శలు తలెత్తకుండా బీఆరెస్ కూడా రోగులను తరలించడంలో సాయపడింది. కాంగ్రెస్, బీఆరెస్ నేతలు పోటాపోటీగా రోగులను అంబులెన్స్ లో తరలించడానికి సహాయపడ్డారు.