ఓట్ల వేట.. హరీశ్ బడ్జెట్ ఎలక్షన్ స్పెషల్

ఓట్ల వేట.. హరీశ్ బడ్జెట్ ఎలక్షన్ స్పెషల్

సంక్షేమానికే అధిక ప్రాధాన్యం
90 వేల లోపు రుణమాఫీకి నిధులు
 వ్యవసాయానికి 26 వేల కోట్లు
రైతులు, లబ్ధిదారులకు ప్రత్యేకం
ఇంటి నిర్మాణానికి మూడు లక్షలు
కొనసాగనున్న ‘డబుల్’​ ఇండ్లు
ఉద్యోగాల భర్తీకి వెయ్యి కోట్లు
దళితబంధు ఓకే, గిరిజనబంధుకు నో 
పల్లె ప్రగతికి భారీగానే నిధులు 
జనాకర్షకంగా సాగిన ఆర్థిక మంత్రి లెక్క
‘మసి పూసి మారేడు కాయ’ అన్న విపక్షాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనుకున్నట్టుగానే సంక్షేమం దిశగా పయనించింది. సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పథకాలకే నిధుల వరదను పారించింది. విద్యార్థులు, యువత, మహిళలు సహా సామాజిక వర్గాలన్నింటినీ సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించింది. ఆర్థిక మంత్రి లెక్క ఓటు బ్యాంకును పదిలం చేసుకుంటూనే ముందుకు సాగింది. పనిలో పనిగా పాత బస్తీ మీదా దృష్టిపెట్టింది. విపక్షాలు పదే పదే పదే ప్రస్తావిస్తున్న మెట్రోకూ భారీ నిధులు కేటాయించింది. ప్రతిపక్షాలు మాత్రం హరీశ్ రంగుల ప్రపంచం చూపించారని మండిపడ్డాయి. ఇది ప్రజలను మోసం చేసే బడ్జెట్ అని ఎద్దేవా చేశాయి.   

మాయమాటల గారడీ: –సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 
ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంకెల గారడీ చేశారు. మాయ మాటలతో మభ్యపెట్టారు. బడ్జెట్ మేడి పండు మాదిరిగా ఉంది. రంగుల ప్రపంచం చూపించారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ప్రజలను మోసం చేయడానికి అంకెలు పెంచి బడ్జెట్ పెడుతున్నారని మేం గతంలో మేము చెప్పిందే ఇపుడు నిజమైంది. బడ్జెట్ ను సంపూర్ణంగా అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంటే వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టేవారు.


ప్రజలను మోసం చేసే బడ్జెట్​: – బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ ప్రజలను మోసం చేసే విధంగా ఉంది. చెప్పేవి గొప్పలు. చేసేవీ శూన్యం. నాలుగేండ్లయినా రైతులకు రుణమాఫీ చేయలేదు. ఈసారైనా చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలి. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేకపోతున్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు రెండేళ్లకోసారి ఇస్తున్నారు. కేసీఆర్ కిట్ కు బిల్లులు చెల్లించడం లేదు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతోంది. ‘మన ఊరు మన బడి’ ముందుకు సాగడం లేదు. 


నిధులు పూర్తిగా ఖర్చు చేయాలి: తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

సాగునీటి ప్రాజెక్టులకు రు.26,885 కోట్లు కేటాయించినప్పటికీ కాలయాపనతో వాటి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదారి పడుతున్నాయి. దళితులకు మూడెకరాల భూమి ఊసే లేదు. నిరుద్యోగభృతి, గిరిజనబంధుకు కేటాయింపులు లేవు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలకు కేటాయింపులు తగ్గిస్తున్నారు. ఈ తగ్గింపులు లేకుండా దారిద్య్రరేఖ నుండి వారిని ఎగువకు తీసుకురావడానికి, విద్యా-వైద్యానికి అదనపు నిధులు కేటాయించాలి. కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చుచేయాలి.  

ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి: కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

బీజేపీయేతర రాష్ట్రాల కంటే తెలంగాణది ప్రగతిశీల బడ్జెట్‌. 80 వేల ఉద్యోగాల ఖాళీలను పూర్తి చేయడం సంతోషమే, కాని నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలి. యూనివర్శిటీలకు నిధులు పెంచాలి. పాఠశాలలో మౌలికవసతులు, మురుగుదొడ్లు వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల బీమాను అమలు చేయాలి. కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అందించాలి. ప్రాజెక్టులు పూర్తి చేయాలి.  కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల యేడాదిలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓట్ల వేటకే పెద్ద పీట వేసింది. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కొత్త పథకాలు లేకున్నా ఉన్నవాటిలోనే ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్రయత్నాలు చేశారు. రైతులకు ఈసారి లక్ష వరకు పూర్తిగా రుణమాఫీ చేయనున్నారు. దళితబంధును కంటిన్యూ చేస్తున్నారు. గిరిజనబంధుకు తాత్కాలికంగా బ్రేక్​ ఇచ్చారు. దానికి ఈసారి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు.

కానీ, ఈ పథకాన్ని ఎన్నికల ముందు బయటకు తీసి, ప్రత్యేకంగా నిధులు వెచ్చించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఉద్యోగాల నియామక ప్రక్రియ, కొత్తగా విధులలో చేరే వారి కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. నిరుద్యోగులను గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నించారు. రెండు పడక గదుల ఇండ్ల పథకానికి సైతం ఈసారి రూ. 12 వేల కోట్లను కేటాయించారు. నిరుడు కూడా ఈ స్కీంకు రూ. 11 వేల కోట్లు కేటాయించినా, నిధులివ్వడంలో మాత్రం నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది. ఈసారి దీని నుంచి బయట పడేందుకు నిధులు కేటాయించామని అధికారపక్షం చెప్తోంది. 

పల్లె ఓట్లకు పక్కా ప్లాన్​
ఈయేడాదిలోనే ఎన్నికలు జరగబోతున్నందున నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చే స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను భారీగా పెంచారు. నిరుడు రూ. 2 వేల కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా రూ.10,348 కోట్లకు పెంచారుది. మొత్తం రూ.2,90,396 కోట్లతో మంత్రి హరీశ్​ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గ్రామీణ, పట్టణ రోడ్ల బాగు కోసం, సాగునీటి ప్రాజెక్ట్‌లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పల్లె ప్రగతి, పంచాయతీరాజ్‌ శాఖకే ఏకంగా 31,426 కోట్లు కేటాయించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చే పల్లె ప్రగతి నిధులను ఇక నుంచి నేరుగా పంచాయతీల ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు. 

అప్పు మాఫీ
రైతుబంధు ఇస్తున్నా రైతు రుణాలపై విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఈ విమర్శలను తిప్పి కొట్టేందుకు బడ్జెట్ లో భారీ ప్లాన్​ వేశారు. రూ. లక్ష వరకు పంట పెట్టుబడి రుణాలన్నీ మాఫీ చేసేందుకు నిర్ణయించారు. నాలుగేండ్ల కిందట ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కోసం ఈ యేడాది రైతు రుణమాఫీకి రూ. 6,385 కోట్లు కేటాయించారు.

భారీ కేటాయింపులు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధుకు రూ.17,700 కోట్లు ఇచ్చారు. నిరుడు కూడా ఈ పథకానికి భారీ కేటాయింపులు చేశారు. ఈసారి ఎన్నికల కాలం కావడంతో.. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను మొదలుపెడుతున్నారు. ప్రతి సెగ్మెంట్​ నుంచి 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇక, రైతుబంధుతో ఆ వర్గాలన్నీ తమవైపే ఉంటున్నాయని అంచనా వేస్తున్న కేసీఆర్​ సర్కారు.. ఈసారి కూడా అదే పద్దతిని పాటించింది. రైతు బంధుకు భారీగా రూ.15,075 కోట్ల కేటాయింపులు చేశారు.  

సంక్షేమ ఓటర్లు
సంక్షేమానికి అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు.  కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు కేటాయించారు. ఆసరా పెన్షన్లను పెంచనున్నారు. ఆసరాకు సైతం నిధులు పెంచారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలు, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు పెట్టారు. ఆయా వర్గాలకు వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ రుణాలు, పావులా వడ్డీ, వడ్డీలేని రుణాలను ఇవ్వనున్నట్లు బడ్జెట్​ లో వెల్లడించారు.

ఇంటి నిర్మాణానికి సాయం
సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ పథకాన్ని పట్టాలెక్కించింది. ప్రతి సెగ్మెంట్​ లో 2 వేల మంది లబ్ధిదారులతో పాటుగా సీఎం స్పెషల్​ కోటా కింద 25 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ పథకానికి రూ. 7890 కోట్లు కేటాయింపులు చేశారు. అంతేకాకుండా డబుల్​ ఇండ్ల పథకానికి సైం బడ్జెట్​ లో వస్తున్న ఆనవాయితీని కొనసాగించారు. ఈసారి ఈ ఇండ్లకు రూ. 12 వేల కోట్లను కేటాయించారు. దాదాపు ఇప్పటికే రూ. 1.35 లక్షల ఇండ్లు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన లక్షన్నర ఇండ్లకు ఈ నిధులు వెచ్చించనున్నారు. 

ఓల్డ్​ సిటీలోనూ వేట
ఇటీవలే శంకుస్థాపన చేసిన శంషాబాద్‌ వరకు మెట్రో ప్రాజెక్ట్‌ను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్​ లో రూ. 500 కోట్లు కేటాయించింది. మొత్తం మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఓల్డ్‌ సిటీలో మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు కేటాయించారు.