నాడు మైగ్రేషన్..  నేడు ఇరిగేషన్!

నాడు మైగ్రేషన్..  నేడు ఇరిగేషన్!
  • పరిశ్రమల హబ్ గా పాలమూరు
  • అందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేం!
  • ఇది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, మహబూబ్​నగర్, జడ్చర్ల : ఒకప్పుడు వలసలకు మారుపేరుగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లా నేడు పచ్చని పంట పొలాలతో కళలాడుతోందని, పాలమూరు జిల్లా ఇప్పుడు పరిశ్రమల హబ్ గా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, మహబూబ్​నగర్ నియోజకవర్గల్లో ఆయన పర్యటించారు. మూసాపేట మండలంలో ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మినిస్టర్లు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్​మాట్లాడారు. చదువుకున్న ప్రతీవ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని, అది ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదన్నారు. డబ్బులు అందరి వద్దా ఉంటాయి.. కానీ కొంతమందికి మాత్రమే సేవ చేసే దృక్పథం ఉంటుందన్నారు. మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. 

ప్రభుత్వోద్యోగులు ఆరున్నర లక్షలే..
తెలంగాణ జనాభా 4 కోట్లకు పైగా ఉంటే అందులో సర్కారు కొలువులు ఆరున్నర లక్షలు మాత్రమే అని మంత్రి కేటీఆర్​అన్నారు. నాడు పరిశ్రమల స్థాపన రెడ్ టేప్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచిందన్నారు. ప్రైవేట్ రంగాల్లో నైపుణ్యాలు అందిపుచ్చుకుంటేనే భవిష్యత్​ఉంటుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రాష్ట్రంలో 24 గంటలు కరెంట్​ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రం ఎంత ప్రగతి సాధించించామని, వలస పాలనలో ఎక్కడో ఉన్న మనం ఎక్కడికో వచ్చామన్నారు. ప్రతీ జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఉన్న కాన్పులు నేడు 60 శాతం పెరిగాయన్నరు. నాడు రియల్ ఎస్టేట్ ధర ఎంత..? నేడు భూముల ధర ఎంత ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఎన్నికల సమీపిస్తున్నాయి కాంగ్రెస్, బీజేపీ లీడర్లు సంక్రాంతి పండగ ముందు గంగిరెద్దుల ఇండ్ల ముందుకు వచ్చినట్లు వస్తారన్నారు. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు. ఏ ప్రభుత్వాలు చేయలేని పనులు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిందని కేటీఆర్​పేర్కొన్నారు.

యాట కూర తిన్నంక తోటకూర తిన్నట్లుంటది..
మినిస్టర్​మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ‘యాటకూర తిన్నంక తోటకూర తిన్నట్లు ఉంటది’ అని మంత్రి కేటీఆర్​అనడంతో ప్రజలు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. మహబూబ్​నగర్​జిల్లాలోని అడ్డాకులలో నిర్వహించిన సభలో కేటీఆర్ తన చలోక్తులతో నవ్వులు పూయించారు.  గురువారం అడ్డాకులలోని వేముల పొన్నకల్ లో కేటీఆర్ ఎస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ 2వ యూనిట్‌కు  భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. కంపెనీల రాకడతో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతోందని, జీవశాస్త్ర విజ్ఞాన పెట్టుబడుల హబ్‌గా తెలంగాణ విరాజిల్లుతున్నదని చెప్పారు. అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి  మాట్లాడుతూ నాడు పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని, ఇపుడు జిల్లా సస్యశ్యామలంగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు కూడా అడిగే హక్కు లేదన్నారు.
 
మూణ్నాలుగు నెల్లల్లో రిజర్వాయర్ నింపుతం..
పాలమూరు– రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కార్వేన, ఉదండపూర్ రిజర్వాయర్లను మూణ్నాలుగు నెలల్లో  కృష్ణ జలాలతో నింపుతామని  మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం జడ్చర్లలోని ఎర్రగుట్ట వద్ద నిర్మించిన 560 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 70 ఏండ్లు ఉమ్మడి రాష్టాన్ని పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేంటో చెప్పకుండానే  కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేట న్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో సుమారు 96 లక్షల ఎకరాల్లో రైతులు వరి ధాన్యం పండిస్తుంటే, ఒక్క తెలంగాణ లోనే సుమారు 56 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారని ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఒక్క తెలంగాణలోనే సాధ్యపడిందని అన్నారు.  

జడ్చర్లకు రూ.30 కోట్లు మంజూరు..
జడ్చర్ల పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ పలు వరాలు కురిపించారు. జనాభా ప్రాతిపదికన జడ్చర్ల మున్సిపాలిటీని ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తూ త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జడ్చర్ల అభివృద్ధికి రూ.30 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటే శ్వర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.