జైల్లో కోడికత్తి శ్రీనును కలిసిన పట్టాభి

జైల్లో కోడికత్తి శ్రీనును కలిసిన పట్టాభి

జగన్ పాలనలో ఏపీ సర్వనాశనం అవుతోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. ముఖ్యంగా యువత జీవితాలు నిర్వీర్యమైపోతున్నాయని అన్నారు. డ్రగ్స్, గంజాయికేసుల్లో చిక్కుకుని  డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు జైళ్లపాలవుతున్నారని చెప్పారు. ఈ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఎంతో మంది విద్యార్థులను తాను రాజమండ్రి సెంట్రల్ జైల్లో చూశానని తెలిపారు. వైసీపీ నేతల డ్రగ్స్ దందాకు విద్యార్థులు బలవుతున్నారని విమర్శించారు.  విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనును జైల్లో తాను కలిశానని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హింసకు శ్రీను ఒక బాధితుడిగా మిగిలిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తనకు తోడుగా లాయర్ ను అనుమతించాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఏపీ సీఐడీ విచారణకు వెళ్లిన వాళ్లంతా లాయర్లు లేకుండానే వెళ్లారని గుర్తు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నారా లోకేశ్ కరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గన్నవరం కేసులో గత నెల 22న పట్టాభిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.