ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం

ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా పై ఉక్కు పాదం
  • మిల్లర్లు, అంతర్రాష్ట్ర రవాణాపై పోలీసు నిఘా
  • తరచూ నేరం చేస్తూ పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు
  • క్షేత్రస్థాయిలో విచారణ- దోషులు ఎవరిని వదలం -ఎటువంటి వారైనా చట్ట ప్రకారం చర్యలు
  • 12 లక్షల రూపాయల విలువచేసే 300 క్వింటాల పిడిఎస్ బియ్యం సీజ్ - కేసు నమోదు
  • సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ హెగ్డే బికె

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే ఉక్కు పాదం మోపుతామని సూర్యాపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ హెగ్డే బికే హెచ్చరించారు. 12 లక్షల రూపాయల విలువ చేసే ప్రజా పంపిణీ బియ్యం, ఒక లారీ, మూడు అశోక్ లేలాండ్ వాహనాలు సీజ్ చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్న సందర్భంగా ఆయన గురువారం జిల్లా కేంద్రంలో విలేకరులకు వివరాలను వెల్లడించారు. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడు అయిన కోదాడ పట్టణానికి చెందిన షేక్ మీరా అలీ పరారీలో ఉన్నాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కు చెందిన లారీ డ్రైవర్ భత్తుల గురవయ్య, లారీ క్లీనర్ గద్దల వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన డ్రైవర్ కం ఓనర్ వడ్త్యా మంగులాల్, డ్రైవర్ పెని గుంట నరేష్ లను అరెస్టు చేసి చీటింగ్ కేసు, నిత్యావసరాల వస్తువుల దుర్వినియోగ చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. నిందితులు గ్రామాలలో తిరుగుతూ తక్కువ ధరకు బియ్యం కొని హైదరాబాద్ కు తరలిస్తున్నారని చెప్పారు. బుధవారం సూర్యాపేట జనగామ క్రాస్ రోడ్డు వద్ద నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట సిఐ జి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సై బి ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా లారీ నెంబర్ ఏపీ 16 టివై 63 16 లారీ ఆపి తనిఖీ చేయగా 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారని, నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు కూసుమంచి గ్రామానికి వెళ్లి అక్కడ తనిఖీ చేయగా మూడు అశోక్ లేలాండ్ వాహనాల్లో 100 కింటాల ప్రభుత్వం రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగిందన్నారు. 

క్షేత్రస్థాయిలో విచారణ దోషులు ఎవరిని వదలం ఎటువంటి వారైనా చట్టప్రకారం చర్యలు

ప్రజా పంపిణీ బియ్యం లబ్ధిదారులకు చేరాలి

ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా విషయంలో క్షేత్రస్థాయిలో పక్కాగా విచారణ జరపనున్నామని, దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని, ఎవరిని వదలమని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్ హెచ్చరించారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా పిడిఎస్ బియ్యం లబ్ధిదారులకు చేరాలని చెప్పారు. ప్రభుత్వం ఒక మంచి లక్ష్యం ఉద్దేశంతో, ప్రజల సంక్షేమ కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యాన్ని అందిస్తుందని, ఈ బియ్యం లబ్ధిదారులకు చేరకుండా అక్రమాలకు పాల్పడవద్దని, రీసైకిలింగ్ చేయవద్దని, అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అరి కట్టడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిరంతరం కృషి చేస్తామని వివరించారు. మిల్లర్లు, అంతర్రాష్ట్ర రవాణాపై పోలీస్ నిఘా ఉన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా పంపిణీ బియ్యం  విషయంలో రేషన్ డీలర్లు, మిల్లర్లు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. అక్రమాలకు పాల్పడి విలువైన జీవితాలను జైలు పాలు చేయవద్దని, ఇలాంటి నేరాలు అలవాటుగా చేసే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొని పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా, ఇతర అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ఎక్కడైనా ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్రమంగా రవాణా చేస్తున్న 300 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టుకోవడంలో పనిచేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్ ఎస్సై బి . ప్రవీణ్ కుమార్, సిబ్బంది కృష్ణ, కరుణాకర్, సైదులు, ప్రతాప్ తదితరులు ఉన్నారు.