రాజకీయ రథచక్రాలొస్తున్నాయ్..

రాజకీయ రథచక్రాలొస్తున్నాయ్..

1200 రోజులుగా అమరావతి  రాజధాని పరిరక్షణ కోసం వెన్ను చూపక, మాట తప్పక, మడమ చూపక, లాఠీలకు వెరవక దుర్మార్గపు నాయకులకు ఎదురు తిరిగిన ఉద్యమ కారులకు ఉద్యమాది అభినందనలు అని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  పేర్కొన్నారు.  శ్రీరాముడి రాజధాని అయోధ్య అని.. శ్రీకృష్ణుడిది ద్వారకా, దేవతల రాజధాని అమరావతి అని తెలిపారు. అమరావతిపై నారా చంద్రబాబు  తీసుకున్న నిర్ణయం సముచితమేనన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి ప్రకటన చేస్తే ప్రతిపక్ష నేత మద్దతు పలికారన్నారు. అధికార పక్షం నిర్ణయం మంచిది కనుక అనాడు జగన్  స్వాగతించారన్నారు.  అమరావతి రాజధాని ప్రపంచ తెలుగు ప్రజల ఆకాంక్ష అని కోటంరెడ్డి పేర్కొన్నారు. తాము ఎన్నికల ప్రచారంలో అమరావతే  రాజధాని అని ఓట్లు వేయించుకున్నామని ప్రశ్నించారు. పొరపాటు చేయడం సహజమని.. సరిదిద్దుకుని చెబుతున్నానన్నారు. 1200 రోజులుగా సాగుతున్న  ఉద్యమాన్ని గౌరవిస్తానని జగన్ చెబితే ప్రజలు నేటికీ స్వాగతిస్తారన్నారు. అమరావతి మర్చొద్దు అని సీఎంకు చెప్పాలని.. ప్రధాని మోదీ ని కోటంరెడ్డి వినయ పూర్వకంగా అర్ధించారు. ఇంకా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ''ఇన్నిరోజులుగా ఎందుకు ముందుకు రాలేదు? అని అడిగితే ఒక్కటే చెబుతా.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేను. జగన్ ఏమి చెబితే అదే మాట్లాడాలి.  నెల్లూరు జిల్లాలో వరద ప్రాంతాలు తిరుగుతున్నా. కొత్తూరు నుంచి అబపురం వెళ్తున్నా. అప్పుడు మిమ్మల్ని చూసి ఆగాను. ఎందుకో తెలియదు.. నాకు అమరావతి ఉద్యమానికి ఏదో తెలియని బంధం ఉంది. నెల్లూరులో రైతులను పరామర్శించినప్పటి నుంచి పార్టీ లో కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు చెబుతున్నా అమరావతి ఏకైక రాజధాని. నా మనవళ్లు నన్ను చరిత్ర హీనుడు అనుకోకుండా వుండాలనే అమరావతికి మద్దతు ఇస్తున్నా. అమరావతి రాజధాని నుంచి మట్టి పెల్ల కూడా ఎవ్వరూ తీసుకు వెళ్ళలేరు. రానున్న రోజుల్లో అమరావతి రాజకీయ రథచక్రాలు వస్తున్నాయి. అమరావతి కి మద్దతు నిలిచిన పార్టీలకు సునామీ లాంటి మద్దతు వస్తుంది. 3 రాజధానులు అన్న పార్టీ ఈ రధచక్రాల కింద నలిగిపోతుంది. అమరావతి కోసం నెల్లూరు జిల్లా ఇప్పుడు బ్రహ్మ రథం పట్టేందుకు సిద్ధంగా ఉంది''. అని పేర్కొన్నారు.