25న ప్రజా చైతన్య బస్సు జాతాను జయప్రదం చేయండి పోస్టర్ ఆవిష్కరణ

25న ప్రజా చైతన్య బస్సు జాతాను జయప్రదం చేయండి పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, మెదక్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక, సామ్యవాద ,లౌకిక న్యాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జన చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం అన్నారు. కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించేందుకు ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని కాపాడుకునేందుకు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలు రాష్ట్రంలో మూడు యాత్రలు జరుగుతున్నాయన్నారు. మార్చి 24వ తేదీన నిజాంబాద్ జిల్లాలో మూడవ యాత్ర ప్రారంభమై మెదక్ జిల్లాకు 25న జిల్లాలోని రామాయంపేటకు చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా మెదక్ కేవల్ కిషన్ భవనంలో ప్రచార జన చైతన్య యాత్ర పోస్టర్లను విడుదల చేశారు.బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలను మోపుతుందన్నారు. 23 కోట్ల మందిని పేదలుగా మార్చారని ఆయన మండిపడ్డారు. దేశం అంటే అంబానీ, ఆధానీల సొత్తుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీగా ఉపయోగించే నిత్యవసర సరుకుల ధరలు నూనెలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ తో సహా అన్ని రకాల రేట్లను మూడు రెట్లు అధికంగా పెంచారని ఆయన మండిపడ్డారు. 2014లో 410 రూపాయలు ఉన్న గ్యాస్ ధర నేడు 1350కి పెరిగిందన్నారు. ఈ ధరల పెరుగుదల వల్ల కార్పోరేట్ల వేలకోట్ల రూపాయల లాభాలను పోగేసుకుంటారన్నారు. మెదక్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి జిల్లాలోని కార్మికవర్గం, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయడానికి అందరూ తమ వంతు కృషిగా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కే.నరసమ్మ, జిల్లా నాయకులు ప్రవీణ్, జగన్, లచ్చగౌద్, మోహినుద్దీన్, కమల తదితరులు పాల్గొన్నారు.