ఎండిన కడుపు - నిండని కుండ- రైతుల పరిస్థితి!

ఎండిన కడుపు - నిండని కుండ- రైతుల పరిస్థితి!
present-situation-of-farmers

భారతీయ వ్యవసాయ రంగం 9000 బీసీఈలో ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తుంది. దేశంలో వ్యవసాయ రంగం 1961 నుండి రెండు వేల వరకు ఉత్పదక విధానాన్ని పరిశీలిస్తే 400 మిలియన్ టన్నులతో మొదలై నేడు వెయ్యి మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. అయితే వ్యవసాయ రంగం ని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన మేర అభివృద్ధి చేయకపోవడం నేడు దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతుకు సరైన ప్రోత్సాహం లేకపోవడం ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను వ్యవసాయ రంగానికి ఇవ్వకపోవడం భారతదేశంలో వ్యవసాయ “ ఎండిన కడుపు -నిండనికుండా- రైతుల పరిస్థితి” అన్న చందనంగా కనబడుతుంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు అంగట్లో కష్టాలే దర్శనమిస్తాయి. ఎందుకంటే పండించిన పంటను అమ్ముకోవడానికి అంగడికి ( మార్కెట్) వెళ్తే అక్కడ పూర్తిగా దళారీమయం దళారుల చేతిలో రైతు విలబిలలాడ బలిసిందే దళారులు చెప్పిందే ధరలు, లేదంటే అమ్ముకోలేని పరిస్థితి. ఇది ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రైతు ఎదుర్కొంటున్న సమస్య అని చెప్పవచ్చు.!సామాజిక బాధ్యతను హృదయపూర్వకంగా నిర్వహిస్తున్న రైతాంగం  ప్రభుత్వ ప్రలోభాలు వాగ్దానాల కోసం ఏనాడు కూడా ఎదురుచూసిన దాఖలా లేదు.  పూర్వకాలం నుండి కూడా రైతన్నలు  తమ కష్టాన్ని నమ్ముకుని ప్రకృతి విపత్తుల నుండి , అతివృష్టి అనావృష్టి తో పాటు  రుణాల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ  మొక్కవోని ధైర్యంతో  పంటలు పండించి ఉత్పత్తులు పెంచి  ప్రజలందరికీ తిండిపెట్టి అన్నదాతలుగా తమ పేరును  సార్థకం చేసుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి.

తాము ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర లభించాలని,  ప్రభుత్వం భరోసా ఇవ్వాలని,  నిలువ చేసుకోవడానికి తగు సౌకర్యాలు కల్పించాలని,  ప్రకృతి వైపరీత్యాలు జరిగి నష్టపోయినప్పుడు  మాత్రమే తమను ఆదుకోవాలని గతంలో రైతులు ప్రభుత్వాలను కోరేవారు . ప్రభుత్వం నుండి  ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రైతుబంధు పద్ధతిలో  ఆర్థిక సాయం కోసం ఏనాడు కూడా  చేతులు చాచి ఆడిన సందర్భాలు గతంలో అంతగా లేవు . ఆనాటి రైతాంగం యొక్క దూరదృష్టి, ఆత్మవిశ్వాసము,  స్వేచ్ఛగా జీవించే తత్వము,  సామాజిక బాధ్యతను  గుర్తించిన విధానాన్ని  పరిశీలించినట్లయితే  ఇప్పటి రైతాంగ పద్ధతులతో పోల్చుకుంటే చాలా తేడా కనిపిస్తున్నది.కానీ పరిస్థితులలో ఎంతో మార్పు వచ్చింది. ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామని,  రుణమాఫీ ఒకేసారి చేస్తామని , పంట ఉత్పత్తి సహాయం రైతుబంధు రూపంలో అందిస్తామని,  హామీలు ఇవ్వడంతో పాటు రైతుబంధును తెలంగాణ  రాష్ట్రంలో అమలు చేస్తున్న విషయాన్ని పరిశీలించినప్పుడు  కొన్ని వాస్తవాలు మరికొన్ని  వైరుధ్యాలను కూడా మనం గమనించవచ్చు. మరింత ముందుకు పోతే  ఒక్క గుంట కూడా భూమి లేనటువంటి అనేక పేద కుటుంబాలు  రెక్కల కష్టం పైన ఆధారపడి బతుకుతున్న సందర్భంలో  ఈ దేశ శ్రామిక శక్తిగా ఉత్పత్తిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి  చేయూత లేదని ఒకవైపు ఆరోపిస్తున్నారు.  మరొకవైపు రైతుబంధు విషయంలో  అనేక తప్పుడు విధానాలకు పాల్పడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విధానం  వందల ఎకరాలు కలిగిన వారికి  కూడా  విచ్చలవిడిగా  ఆర్థిక సాయం చేస్తూ గుట్టలు, చెట్లు, పుట్టలు,  గృహ నిర్మాణ స్థలాలకు కూడా  ప్రజాధనాన్ని ఉచితంగా పంచి దుర్నియోగం చేస్తున్న విషయాన్ని పరిశీలిస్తే  ఇది ఏ రకంగా రైతుకు బంధువుగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు .  

రైతుబంధు పథకంలోని అసంబద్ధ విధానాలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  నుండి గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా 8 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే  సుమారు 40 శాతం గా ఉన్నటువంటి కౌలు రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆర్థిక సౌకర్యం లేకపోవడం  పైన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?.  వందల ఎకరాల స్థలం ఉన్నటువంటి  భూస్వాములు  పంట పొలాలతో ,తమ గ్రామాలతో సంబంధం లేకుండా పట్టణాలలో నివసిస్తుంటే వాళ్ల ఖాతాలలో ప్రభుత్వ నిధులు జమ అవుతుంటే కౌలు చేస్తున్న రైతులు మాత్రం పెట్టుబడి సాయం లేక రుణదాతల  విష కౌగిట్లో బందీలుగా మారి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు  ప్రభుత్వం ఏ !రకంగా సమర్ధించుకుంటున్నదో అర్థం కావడం లేదు.  2018 లో ప్రారంభించిన టువంటి రైతుబంధు పథకం  ప్రస్తుతం అందజేస్తున్నటువంటి పదవ విడతతో కలుపుకుంటే సుమారు 66 వేల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాలలో జమ చేసినట్టు చెబుతున్నటువంటి ప్రభుత్వ వర్గాల లెక్కలు , మించిన భూమి ఉన్నటువంటి ధనవంతులు, సంపన్న వర్గాలకు మాత్రమే  జేబులు నింపితే పేద వర్గాలకు ఈ పథకంతో ప్రయోజనం ఏమిటి?  ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కొక్క రైతు తల మీద  1,50,000 రుణభారం ఉన్నట్లు  అదే సందర్భంలో రాష్ట్రంలో 37 లక్షల మంది రైతులకు  హామీ ఇచ్చిన ఒకే విడతలో రుణమాఫీని  అమలు చేయనటువంటి ప్రభుత్వ విధానం...  రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అందులో కౌ లు రైతులే  80 శాతం గా ఉన్నారని వైయస్సార్సీపి  నాయకురాలు షర్మిల చేస్తున్న ఆరోపణ లేదా విమర్శకు  ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుంది.  శ్రమ ఒకరిది.... సిరి మరొకరిది:అన్నపురాసులు ఒకచోట ఆకలి కేకలు మరొకచోట  అన్న కాళోజీ మాటలు  దేశంలోని అన్ని రంగాలలోనూ వర్తింప చేసుకోవచ్చు.  

అసమానతలు, అంతరాలు, వివక్షత విచ్చలవిడిగా కొనసాగుతున్నటువంటి ఈ దేశంలో వ్యవసాయ  రంగం ఇ0 దుకు మినహాయింపు ఏమీ కాదు. పైగా  వ్యవసాయాన్ని సంక్షోభంలో కూరుకుపోయేలాగా చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల వల్లనే  రైతులు అప్పుల పాలవుతున్నారని రైతు సంఘాలు చేస్తున్న ఆరోపణలకు  ప్రభుత్వం దగ్గర సమాధానం ఎందుకు లేదో అర్థం కావడం లేదు.  ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తలపెట్టినటువంటి క్రియాశీలక కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేయవలసినటువంటి ప్రభుత్వ విధానాన్ని  పొగడ్తలతో, పాలాభిషేకాలతో,  ప్రజలు పండుగలు జరుపుకోవడంతో స్వాగతించడం ఏ వర్గ ప్రయోజనం కోసం? ఏ సంస్కృతికి నిదర్శనం అర్థం చేసుకోవచ్చు.  కౌలు రైతులు  భూమి ఆసామికి చెల్లించవలసిన డబ్బులతో పాటు  మూల పెట్టుబడికి  వడ్డీ వ్యాపారస్తుల తెచ్చినటువంటి డబ్బులు సరిపోక ఇబ్బందులకు గురై  అప్పులు చెల్లించడానికి అప్పులు చేస్తూ  అయోమయంలో పడిపోతున్న కారణంగానే  ముఖ్యంగా కౌ లు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నది అని ఇటీవల  రైతు స్వరాజ్య వేదిక చేసిన సర్వే ఫలితాలు వెల్లడించిన నేపథ్యంలో  కౌలు రైతులకు కూడా    పెట్టుబడి సాయాన్ని అందించవలసిన అవసరాన్ని  ఈ నివేదిక నొక్కి చెబుతున్నది.  వ్యవసాయం పైననే ఆధారపడి  క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి రైతులకు, రైతు కూలీలకు మాత్రమే ఈ ప్రభుత్వ  సాయాన్ని పొందే అర్హత ఉంటుంది. కానీ  పదులు, వందల ఎకరాలు కలిగి ఉండి పెట్టుబడుదారులుగా చలామనవుతూ  ఉత్పత్తిలో భాగస్వామి కానటువంటి వారికి ప్రజల సొమ్మును  పెట్టుబడి సాయం గా పొందే    అర్హత లేదు అని  రాజకీయ విశ్లేషకులు, మేధావులు,  రైతు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.  

అంతేకాకుండా  రైతు బంధు నిధులు ఖాతాలలో పడగానే ఆ డబ్బును  తిరిగి మద్యం దుకాణాలు బార్ల ద్వారా ప్రభుత్వ ఖాతాకు  జమ అయ్యే విధంగా పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ మద్యం విధానం  యువ రైతులతో పాటు మధ్య వయస్సు వృద్ధుల వరకు కూడా  అనివార్యంగా నిర్బంధంగా మద్యానికి బానిసలు అయ్యేలా  కొనసాగుతున్న ప్రభుత్వ చర్య ఏ రకంగా ప్రజలకు  పెట్టుబడి సాయం గా ఉపయోగపడుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి . ఇక తమ రెక్కల కష్టాన్ని నమ్ముకుని ఎలాంటి భూ సౌకర్యం లేనటువంటి  పేద వర్గాలకు  ప్రభుత్వం ఏ రకమైన సహకారం కూడా చేయడం లేదు.  కోటీశ్వరులై భూమి కలిగినటువంటి వారికి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కట్టబెడుతున్న ప్రభుత్వం  భూమి లేని వారికి భూమిని ఉచితంగా పంపిణీ చేయకుండా  వారిని   పేదవాళ్లుగా యాచకులు గానే  కొనసాగించడం  పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనం కోసం కాదా?  భూమి లేకుండా ^  శ్రమను నమ్ముకొని బతుకుతున్న నాకు ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏమిటి? ప్రభుత్వంతో నాకు పని ఏమిటి ? ప్రభుత్వం చేస్తున్న ప్రలోభాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదా అని నిక్కచ్చిగా ప్రశ్నిస్తున్నారు కొందరు . రైతులారా మేల్కొనండి!  అసంబద్ధ విధానాలను ప్రశ్నించండి ! మీ వరకే ఆలోచించకండి.ఐదు ఎకరాల పైబడి భూమి ఉన్నటువంటి రైతులు పెట్టుబడిదారులు, భూస్వాములకు రైతుబంధు  నిలిపివేయాలని ఆ రకంగా వృధా అవుతున్న ప్రజాధనాన్ని  పొదుపు చేయడం ద్వారా రైతుల పైన మోపబడుతున్న రుణ భారాన్ని తగ్గించవచ్చునని  అంతేకాకుండా భూమిలేని పేదలకు  ప్రభుత్వ భూములతో పాటు  వ్యవసాయ భూములను కొనుగోలు చేసి పంపిణీ చేయవలసిన అవసరాన్ని కూడా  ప్రభుత్వం గుర్తించేలాగా రైతులు ఒత్తిడి చేయవలసిన అవసరం ఉంది.  కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులు  ,ఎదుర్కొంటున్న సమస్యలు  మానవతా దృక్పథంతోని ఆలోచించి  ఆ వర్గానికి కూడా రైతుబంధును  వ్యవసాయ సాగు రూపంలో  అందించే విధంగా  ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలి.  

గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాటు  హామీ ఇచ్చిన విధంగా  ఎక్కువ రుణాలు కలిగి ఉన్నటువంటి పేద వర్గాలకు మాత్రమే  ఒకేసారి రుణమాఫీ ని అమలు చేయడం ద్వారా  కష్టాల నుండి రైతు లోకం బయటపడడానికి ఆస్కారం ఉంటుందని  చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఎంతో ఉన్నది.  చాలామంది రైతులు తమ వరకే ఆలోచించి  అనేక రకాల ప్రయోజనాలు తమకు అందుతున్నప్పుడు  తమకంటే దీనంగా ఉన్నటువంటి ప్రజలు రైతులు భూమిలేని కార్మికుల యొక్క పరిస్థితులను  అర్థం చేసుకోకుండా  పాలకపక్షాలకు వత్తాసు పలకడాన్ని మానుకోవాలి. అదే సమయంలో  సామాజిక బాధ్యతగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయాన్ని  పొగడ్తలతో ముంచెత్తడం,  పండుగలు జరుపుకోవడం, పాలాభిషేకాలతో  వికృత సంస్కృతికి దిగజారడం   సరైనది కాదని గుర్తిస్తే మంచిది. అదే సందర్భంలో  రైతుబంధు ద్వారా జమ అవుతున్న నిధులను తిరిగి ప్రభుత్వాలు పరోక్షంగా  తమ ఖాతాకే జమ అయ్యే విధంగా యువ రైతులతోపాటు రైతు లోకాన్ని ప్రలోభ పెడుతున్నటువంటి వాళ్ళు మద్యం దుకాణాలు తదితర!ప్రలోభాలపైన  స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలి. కానీ  త్రాగుడుకు, మద్యానికి ఇతర  తప్పుడు మార్గాలకు బానిసలుగా మారితే  రైతుబంధు రూపంలో ప్రజల ధనాన్ని పొందుతున్న వా రు పరోక్షంగా ఇతర పేద వర్గాలు కార్మికులు  కూలీలకు అన్యాయం చేసిన వారు అవుతారు అని గ్రహించడం శ్రేయస్కరం.  

ఇక ప్రజాధనాన్ని వివిధ పథకాల రూపంలో  శాస్త్రీయ పద్ధతులకు భిన్నంగా మొక్కుబడిగా  ఇష్టారాజ్యంగా  పంపిణీ చేయడమే పరిపాలన అనుకుంటే  ప్రజాధనం అందనటువంటి వర్గాలు  అనేకం ఉంటారని  గ్రహించాలి.  ప్రజలందరికీ చెందినటువంటి సంపద కొద్ది మందికి మాత్రమే అందే విధానం  అశాస్త్రీయమే కాదు  అన్యాయము కూడా.  తమ హక్కులను తాము పొందలేనప్పుడు,  కొన్ని వర్గాలను పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వివక్షతకు గురిచేసినప్పుడు  అనేక సమస్యలతో పాటు పేదరికంలోనే  కూరుకు పోయేలా  నెట్టి వేయబడుతున్నటువంటి వర్గాలు ఎవరైనా  తమ హక్కుల సాధన కోసం  పాలకుల పైన పోరాడే అవకాశం ఉంటుంది .ఆ క్రమంలో వచ్చిన ప్రశ్ననే  భూమిలేని మాకు  ఈ రైతుబంధు తో ప్రయోజనం ఏమిటి !మేధావులు చేస్తున్న సూచనలు :రైతుబంధు రూపంలో చేస్తున్న సాయం  పరిమిత భూమి విస్తీర్ణం ఉన్న రైతులకు మాత్రమే వర్తించాలి . - పదులు, వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు వర్తింప చేస్తే  అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  శ్రమైక జీవన తత్వాన్ని నిరసించి  సోమరితనాన్ని పెంచినట్లు  అవుతుంది. రైతు బంధు అంటేనే అర్థం ఉత్పత్తి ప్రక్రియలో పనిచేస్తున్నటువంటి రైతుకు  పెట్టుబడి రూపంలో సాయం అందించడం కానీ వ్యవసాయమే లేని,  పంటలు అసలే పండించని,  గుట్టలు చెట్లు ఇళ్ల స్థలాలు ఖాళీ భూములకు  కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంటే  ఈ ప్రజాధనం దుర్వినియోగం కావడానికి ప్రభుత్వం జవాబుదారీ  కావలసి ఉంటుంది . 

రైతులు పాలాభిషేకాలు, ప్రశంసలు, పండుగలకు  అలవాటు పడుతున్న  వికృత అసహజ ధోరణిని పాలకులు నిరసించాలి.  ముఖ్యంగా రైతుబంధు జమ అయిన రోజులలో  బార్లు మద్యం దుకాణాల గిరాకీ పెరగడాన్ని గమనిస్తే  రైతులు ఏ రకంగా నష్టపోతున్నారో అంచనా వేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే . 40% గా ఉన్న కౌ లు రైతులకు యాజమాన్య హక్కులు లేకపోగా  యజమానికి చెల్లించడానికి,  తాను బ్రతకడానికి  సరిపోని స్థాయిలో ఉత్పత్తి జరుగుతూ ఉంటే  కౌలు రైతులను రైతులు గానే పరిగణించనటువంటి  తప్పుడు విధానం  మారాలి. కౌలు రైతులకు  సాగు సాయాన్ని అందించాలి.  క్రమంగా భూమిలేని పేదలకు భూములు పంపిణీ చేయడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.  రుణమాఫీ వంటి అనేక హామీలతో ప్రజలు రైతుల యొక్క ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు  ఏక మొత్తము రుణమాఫీని అమలు చేయకుండా  రైతు రుణభారానికి పరోక్షంగా కారణం అవుతున్న ప్రభుత్వ విధానాలను సమీక్షించుకోవాలి.  దీని పర్యవసానమే రైతు ఆత్మహత్యలు అని ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది. ఏది ఏమైనా దేశంలో రైతుల పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి రైతు ఒక్కసారి పంటను( క్రాఫ్ హాలిడే) ప్రకటిస్తే దేశంలో ఆహార కొరత, ఆకలి చావులు తలెత్తుతాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుని ఎప్పుడు కంటి నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలపైనే ఉందని చెప్పాలి.

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయం

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం