పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న పశు మిత్రలకు వేతనం నిర్ణయించాలి

పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న పశు మిత్రలకు వేతనం నిర్ణయించాలి
  • ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటుంది.
  • హక్కులు సాధించుకొనేవరకు పోరాటం చేస్తాం
  • సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన సురేష్ 

ఖానాపూర్, ముద్ర : పశుసంవర్థక శాఖ పరిధిలో పని  చేస్తున్న పశు మిత్రులకు వేతనం నిర్ణయించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఖానాపూర్ నియోజకవర్గం డివిజన్ స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. తొలుత ర్యాలీ గా ఎమ్మెల్యే రేఖానాయక్ ఇంటి వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు సంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న పశుమిత్రలు ఎలాంటి వేతనం లేకుండా ఉచిత సేవలు చేస్తున్నారని అన్నారు. నిర్మల్ జిల్లా లో పశువైద్య ఆరోగ్యశాఖ లో పశుమిత్ర పేరుతో  జంతువులకు ఆరోగ్యపరమైన సేవలు అందిస్తున్నారని, ఎలాంటి పారితోషకం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకుంటున్నదని, ఈ డిపార్ట్మెంట్లో రాష్ట్రవ్యాప్తంగా 2500 మంది పశుమిత్రులు గత 8 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారని, ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. వీరికి ఐకెపి ద్వారా ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పారితోషికాలు నిర్ణయించకుండా  పశువైద్య శాఖలో పశుమిత్రులుగా నియమించారని,  వీరికి తన ఊరుతో పాటు సబ్ సెంటర్ పరిధిలోని రైతులకు చెందిన వివరాలు సేకరిస్తున్నారని,  జంతువుల ఆరోగ్య సమస్యలను  రాత్రనక పగలనక ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి అవులు,బర్రెలు,మేకలు,గొర్రెలు, కోళ్లు,కుక్కలు జంతువులకు వైద్యపరమైన కృతిమ గర్భదారణ, వాక్సిన్, టీకాలు వేయటం, నట్టల మందు వేయటం, శస్త్ర చికిత్సలు,  గాలి కుంటు వ్యాధి, నీలి నలికా వ్యాధి, పొచ్చమ్మ వ్యాధి, దొబ్బ వ్యాధి తదితర సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పారితోషకం లేకుండా పశుమిత్రులతో వెట్టి చాకిరి చేయించుకోవడం చాలా శోచనీయం అని అన్నారు. వీరు ఆశ వర్కర్స్ వలె ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వేతనం నిర్ణయం చేయాలనీ డిమాండ్ చేశారు. వేతనం నిర్ణయించకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం చాలా దుర్మార్గం అని, రాష్ట్ర ప్రభుత్వమే మహిళా కార్మికులతో వెట్టి చాకిరి చేయించుకోవడం సిగ్గుచేటని, రాబోయే రోజుల్లో పశుమిత్రలు పోరాట మార్గం ద్వారా హక్కులు సాధించుకుంటాo అని హెచ్చరించారు. జూన్ 20 నాడు ఎమ్మెల్యేలకు వినతిపత్రం, జూన్ 22 రక్షణ శాఖ జెడి గారికి వినతిపత్రం, జూన్ 28 నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరవధిక దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షురాలు లావణ్య, డివిజన్ కార్యదర్శి విజిత, ఉపాధ్యక్షులు సుమలత,ప్రగతి, రజిత తదితరులు పాల్గొన్నారు.