ప్రారంభం కానీ వరి కొనుగోలు కేంద్రాలు....
ముద్ర.వీపనగండ్ల:- రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంటలను దళారులకమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవటంతో రైతులు ధాన్యాన్ని భద్రపరుచుకోవడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. మద్దతు ధర లభిస్తుందని నమ్మకంతో ఇప్పటికే రైతులు కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకువచ్చి ఆరబోస్తున్నారు. రోజు ధాన్యాన్ని ప్రతిరోజు నిర్ణీత తేమశాతం వచ్చేవరకు ఆరబెట్టడం మళ్లీ రాత్రి వేళలో కప్పి ఉంచటం జరుగుతుంది.
కొందరు రైతుల ధాన్యం ప్రభుత్వం సూచించిన విధంగా తేమ శాతం వచ్చిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవటంతో ధాన్యాన్ని కాపాడుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని, భద్రపరచిన ధాన్యపురాసుల వద్దకు రాత్రి వేళలో పందులు కుక్కలు వచ్చి ధాన్యాన్ని పాడు చేస్తున్నాయని రైతులు అంటున్నారు.. ఈ మారు వర్షాలు అధికంగా కోరడంతో రిజర్వార్లకు పుష్కలంగా నీళ్లు రావడం, చెరువులు కుంటలు నిండటం తో గత ఏడాది కన్నా ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగిందని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. రైతులకు కావలసిన టార్ఫీలైన్ కవర్లు సరిపోయినన్ని లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద బాడుగకు తెచ్చుకొని రోజువారీగా అద్దె చెల్లిస్తున్నారు. ఒక్కొక్క కవర్కు రోజు 30 నుంచి 50 రూపాయల వరకు అద్దె చెల్లించడం జరుగుతుందని కొనుగోళ్లు వెంటనే ప్రారంభిస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుందని అంటున్నారు. మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా ఐకెపి, తూముకుంట,పాన్గల్ సింగిల్ విండో కేంద్రల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మ వద్దని చెప్తున్న ప్రభుత్వం కేంద్రాలను ఎందుకు ప్రారంభించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మండలంలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఉంచారని, మరో వారం రోజుల్లో అంతకు రెట్టింపుగా కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించటానికి రైతులు తీసుకు వస్తారని, కొనుగోలు ప్రారంభించక పోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. వెంటనే కొనుగోలు ప్రారంభించి కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.
మంత్రి తో ప్రారంభించిన తర్వాత...
మండలంలోని పుల్గర్ చర్ల గ్రామంలో మంగళవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత, మండలంలోని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని మహిళా సమైక్య ఏపిఎం బుచ్చన్న తెలిపారు.