ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న అతివేగం 

ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొన్న అతివేగం 
  • విషాదం మిగిల్చిన రంజాన్ విందు 
  • ఆగి ఉన్న డీసీఎం ను కారు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం 
  • విజయవాడ హైదరాబాద్ హైవే రోడ్డుపై సూర్యాపేట వద్ద ఖమ్మం క్రాస్ రోడ్డు ఫ్లై ఓవర్ పై జరిగిన ప్రమాదం
  • రంజాన్ పండుగ రోజు జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 
  • ఒకే రోజు రెండు యాక్సిడెంట్లలో ఐదుగురు యువకులు మృతి సూర్యాపేటలో, కేతేపల్లి లలో విషాదఛాయలు


సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-అజాగ్రత్త అతివేగం ముగ్గురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. రంజాన్ పర్వదినం అనంతరం న్యూజిలాండ్ వెళ్లాల్సిన సూర్యాపేటకు చెందిన మహమ్మద్ నబీద్ తన మిత్రులు వెన్న నిఖిల్ రెడ్డి, గుండ గాని రాకేష్, చందు తదితరులకు రంజాన్ విందు గురువారం ఇచ్చారు.  విందు అనంతరం తమ తమ ఇళ్లకు వెళుతున్న ఆ యువకుల పాలిట డీసీఎం  మృత్యు శకటంగా మారింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 పై సూర్యాపేట వద్ద ఖమ్మం క్రాస్ రోడ్ ఫ్లై ఓవర్ పై ఈ దుర్ఘటన గురువారం రాత్రి జరిగింది. విందు ముగించుకొని వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న స్నేహితులు అతివేగంతో ప్రయాణిస్తూ జాతీయ రహదారిపై నిలుచున్న డీసీఎం వెనకనుంచి బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు వెన్న నిఖిల్ రెడ్డి (25) మమ్మద్ నబీద్ (26) గుండ గాని రాకేష్ (26) లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ చందును సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దుర్ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించిన పట్టణ సీఐ జి రాజశేఖర్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి కారులో ఇరుక్కున్న వారిని క్రేన్ సాయంతో బయటకు తీయించి ట్రాఫిక్ ని చక్కదిద్దారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజశేఖర్ తెలిపారు. 

నిన్నంటిన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల  రోదనలు

ప్రమాదం జరిగిన స్పాట్ కు, తదుపరి ఏరియా ఆసుపత్రికి చేరుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల హాహకారాలు, ఏడుపులతో ప్రమాద స్థలి, ఏరియా ఆస్పత్రి రోదనలతో నిండిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చిన్న వయసులోనే మరణించడం పట్ల పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. శుక్రవారం మృతి చెందిన వారి అంత్యక్రియలను పూర్తి చేశారు. చికిత్స పొందుతున్న చందు ను మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తదితరులు పరామర్శించారు.

మరో ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం 

సూర్యాపేట సమీపంలోని రాయన్ గూడెం గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. సూర్యాపేట నుండి  హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు రాయన్ గూడెం వద్ద జాతీయ రహదారి 65 పక్కనగల చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో కేతేపల్లి గ్రామానికి చెందిన జటంగి సాయి (17) అంతటి నవీన్ (20)  విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. కారులో గల  డ్రైవర్ చింతపల్లి ధనుష్, మారగొని మహేష్, ఉదయ్, అబ్బూరి గణేష్ లు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ అబ్బూరి గణేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై బాలు నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ  యాక్సిడెంట్లో గాయపడిన మరో ముగ్గురిని రాజకీయ నాయకులు పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.