ప్రయివేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన టీజీ ఆర్టీసీ బస్సు
- 30 మందికి గాయాలు , నలుగురి పరిస్థితి విషమం
ముద్ర ప్రతినిధి , కోదాడ :- ఎన్ ఎచ్ 65 రహదారి పై కోదాడ బైపాస్ కట్టకమ్మగూడెం జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ప్రమాదం జరిగిన స్థలంలో నేషనల్ హైవే వారు రోడ్డు వెడల్పు కు సంబంధించిన పనులు చేస్తున్నారు . ఈ ప్రమాదంలో 30 మంది వరకు గాయపడగా అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వివరాలలోకి వెళితే హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న ప్రయివేట్ ట్రావెల్స్ (మహి ట్రావెల్స్) స్లీపర్ బస్సు ప్రయాణికుల మూత్ర విసర్జన కోసం ప్రక్కకు ఆపగా అదే సమయంలో టీజీ ఆర్టీసీ బస్సు ప్రయివేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుండి బలంగా ఢీ కొట్టటంతో , ప్రయివేట్ ట్రావెల్స్ లో వెనుక కూర్చున్న ప్రయాణికులకు , ఆర్టీసీ బస్సులో ముందు కూర్చున్న ప్రయాణికులకు గాయాలయ్యాయి . స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ పట్టణ పోలీసులు క్షతగాత్రులను 108 ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించడంతో ట్రాఫిక్ ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.