అహింస’, మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

అహింస’, మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్

 ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అందించిన ‘అహింస’ పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా అలరిస్తున్నాయి. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. సినిమా వున్నా లేకపోయినా రోజుకి 18 గంటలు పని చేస్తాను. కన్నడలో కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే దర్శకత్వంకు సంబధించిన  కొన్ని కథలు రాస్తున్నాను. ఐతే నాకు మ్యూజిక్ ఎక్కువ పేరు తీసుకొచ్చింది. కానీ ఒక సందర్భంలో మానేశాను. . బాలు గారు నాకు స్ఫూర్తి. ఆయన పాటపై వున్న అభిమానంతో పరిశ్రమలోకి వచ్చాను. ఆయనకి ఇచ్చిన మాట తీర్చలేక పోయాననే బాధ ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకసారి తేజ గారిని కలవడం జరిగింది. ‘మళ్ళీ మ్యూజిక్ చేయాలి. అది బాలు గారి కోరిక’ అని తేజ గారికి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత తేజ గారు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పారు. అదే ‘అహింస’. నేను నమ్మిందే చేస్తాను. నేను నమ్మిందే చేశాను కాబట్టి ప్రతిది నాకు ఇష్టమే.

అహింస కథ చాలా కొత్తది, నేపధ్య సంగీతం చేసేటప్పుడు చూశాను. చాలా కొత్తగా వుంటుంది. కథ కొత్తగా ఉన్నప్పుడు సంగీతం కూడా సహజంగానే కొత్తగా వినిపిస్తుంది.
నేను ఎప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వలేదండీ. సినిమాకి ఏం కావాలో దానిపై దృష్టి పెట్టాను.  ట్రెండ్ అనేది ప్రత్యేకంగా వుండదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఇచ్చేది జనాలకు నచ్చితే అదే ట్రెండ్. అహింస పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఇంకా రావాలి. రిలీజ్ తర్వాత అది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నాను. జయం సినిమాలో ప్రియతమా పాట సినిమా విడుదల తర్వాత మరో స్థాయికి వెళ్ళింది. అహింస కూడా అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాను. తేజ గారు, నా కాంబోలో  ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్ చేశాం.