అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి - సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి - సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా సీపీ  గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర  మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే  బాధ్యత  పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్‌ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు  189  పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని జోహార్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

 అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమన్గల్ ఎస్ఐ కే హనుమంత్ రెడ్డి, తలకొండపల్లి  పోలీస్ కనీస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మ్ డ్ కానిస్టేబ్లుల్ ఈశ్వర్ రావును సేవలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శాలువా కప్పి సత్కరించారు. 

భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న హాట్ స్ప్రింగ్స్ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందన్నారు. 

1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు అమరులయ్యారు. 'హాట్ స్ప్రింగ్స్' అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం అని, కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన 'హాట్ స్ప్రింగ్స్' నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతీ ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలైందని, మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవన్నారు. 

ఈ కార్యక్రమం లో సైబరాబాద్ అడిషనల్ సీపీ అడ్మిన్  అవినాష్ మహంతి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ  నారాయణ్ నాయక్, డీసీపీ అడ్మిన్  రవి చందన్ రెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ సందీప్, శంషాబాద్ డీసీపీ  నారాయణ రెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ  జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, డీసీపీ రోడ్ సేఫ్టీ ఎల్ సి నాయక్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ షమీర్, సీస్డబ్ల్యూ ఏడీసీపీ శ్రీనివాస్ రావు, ఇతర  ఏడీసీపీలు, ఏసీపీలు, సీఏఓ అకౌంట్స్ చంద్రకళ, సీఏఓ అడ్మిన్ గీత,  ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, సెక్షన్ల సిబ్బంది, పోలీసు సిబ్బంది, మరియు మినిస్టీరియల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.