సాయి చంద్ మృతి తెలంగాణకు తీరని లోటు - మంత్రి శ్రీనివాస్ గౌడ్

సాయి చంద్ మృతి తెలంగాణకు తీరని లోటు - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి ,మహబూబ్నగర్ :రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, కవి, ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ మృతిపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో  మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పోషించిన పాత్ర మర్చిపోలేనిదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, మనకు జరిగిన దోపిడిని ప్రజలకు వివరించడంలో సాయి చంద్ కీలక పాత్ర వహించాడన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా తన గొంతుకతో ఉద్యమ ఆకాంక్షను ప్రజాక్షేత్రానికి తెలియజెప్పిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి చేరవేయడంలోనూ తన పాట ద్వారా ముఖ్య భూమిక పోషించాడన్నారు. ఎక్కడ ఈ ముఖ్య సమావేశం జరిగినా సాయిచంద్ తన పాటతో ప్రజలందరినీ అలరించేవాడని మంత్రి గుర్తు చేసుకున్నారు. సాయిచంద్ పాట తెలంగాణ ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన సాయి చంద్ మృతి పాలమూరుకు, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. సాయి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు.