తిరుమలలో మరోసారి బట్టబయలైన భద్రతా వైఫల్యం

తిరుమలలో మరోసారి బట్టబయలైన భద్రతా వైఫల్యం

తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఇటీవలి కాలంలో ఇది సర్వసాధారణమైపోయింది. మొన్న ఏకంగా తిరుమలలో గంజాయి పట్టుబడింది. బుధవారం  మొదటి ఘాట్ రోడ్డులో అవ్వచారి కోన సమీపంలో రోడ్డు పైనే ధూమపానం చేస్తూ ఇద్దరు యువకులు కనిపించారు. సిగిరేట్ సేవించిన అనంతరం యువకులు వింత చేష్టలతో అక్కడున్న వారికి విసుగు తెప్పించారు. రోడ్డుపై.. కాలిబాట మార్గం పక్కనే ధూమపానం చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. తిరుమలలో భద్రతా వైఫల్యంపై భక్తులు మండి పడుతున్నారు.  శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యం టీటీడీని కలవరపెడుతోంది. తాజాగా గంజాయి పట్టుబడటం ఆశ్చర్యానికి గురి చేసింది. వివిధ ప్రాంతాల నుంచి కొండకు వచ్చే భవన నిర్మాణ కార్మికులు, పారిశుధ్య పనులు చేసే కూలీలు కొద్దిరోజులుగా గంజాయి మత్తులో ఉండటం.. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది వచ్చే తిరుమల పవిత్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కొన్నేళ్ల కిందటే మద్యం, మాంసం, సిగరెట్‌, గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. వాటితో తిరుమలకు రానీయకుండా అలిపిరిలోనే తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. అయితే ఎన్నిరకాల తనిఖీలు చేపడుతున్నప్పటికీ నిషేధిత ఉత్పత్తులు తరచూ కొండపై కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెడితే తాజాగా గంజాయి కూడా తిరుమలకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తిరుమల జీఎన్సీ టోల్‌గేట్‌ వద్ద ఓ కూరగాయల వాహనంలో 200 గ్రాముల గంజాయిని ఎస్‌ఈబీ, విజిలెన్స్‌ గుర్తించింది. ఆ వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మరువకముందే శుక్రవారం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని లగేజీ కౌంటర్‌లో పనిచేసే మరో వ్యక్తి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి ప్యాకెట్లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వరుస ఘటనలతో టీటీడీలో కలవరం మొదలైంది. ప్రతిపక్షాలు కూడా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.