హరగోపాల్​పై దేశద్రోహం కేసు

హరగోపాల్​పై దేశద్రోహం కేసు
  • ఎఫ్ఐఆర్ లో 52 మంది పేర్లు
  • మావోయిస్టులకు సమకరించారని ఆరోపణ 
  • ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న ప్రొఫెసర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో:-పౌర హక్కుల నేత  ప్రొఫెసర్​ హరగోపాల్ మీద​దేశద్రోహం కేసు నమోదైంది. నిరుడు ఆగస్టులోనే ఈ కేసును నమోదు చేశారు. 152 మంది మీద ఉపా, ఆయుధాల చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు హరగోపాల్ సహాయ సహకారాలు అందిస్తున్నారని, మావోయిస్టు పార్టీ పుస్తకాలలో ఆయన పేరు ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 2022 ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి ఠాణాలో కేసు నమోదైంది. ఈ విషయం తాజాగా బయట పడింది. ఇప్పటి వరకు దీన్ని పోలీసులు ఎక్కడా బయట పెట్టలేదు. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు చంద్రమౌళిని రెండునెలల కింద అరెస్ట్‌ చేశారు. ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇతర కేసులూ ఉన్నాయని పోలీసులు అభ్యంతరపెట్టడంతో, అతడి మీద ఉన్న అన్ని కేసుల వివరాలూ అందజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసు విషయం బయటకు వచ్చింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 

జాబితాలొ వీరు

ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌ (ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లు అందులో ఉన్నాయి. తాడ్వాయి ఠాణా పరిధిలోని బీరెల్లి గ్రామం వద్ద మావోయిస్టు పార్టీ సభ్యులు కొంతమంది సమావేశామవుతున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారని,  పోలీసులు రావడంతో పారిపోయారని, అక్కడ లభించిన పుస్తకాల్లో మేధావులు, ఉద్యమకారుల పేర్లు ఉండడంతో వారిని నిందితులుగా చేర్చామని, ప్రభుత్వాన్ని కూలదోయడానికి, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులను హత్య చేయడానికి వీరంతా మావోయిస్టు పార్టీతో కలిసి కుట్ర చేశారని పేర్కొన్నారు. మేధావులను ఇరికించడం వెనుక లోతైన కుట్ర ఉందని, కేసు వివరాలను బయటకు తీయాలని పలు సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. 

ప్రజాస్వామ్యానికి విరుద్ధం

దేశద్రోహం కేసుపై ప్రొఫెసర్​ హరగోపాల్​ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ తమలాంటి వారిపై ఆధారపడదని, వాళ్ల మార్గం వేరని అన్నారు. మావోయిస్టు పుస్తకాలలో తన పేరు ప్రస్తావనకువ స్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కేసులు బయటకు తీయడం దురదృష్టకరమన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని, తనతో పాటుగా మొత్తం 152 మంది కేసు పెట్టడం విషాదకరమన్నారు. ఉపా చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని, కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అందరం కలిసి మట్లాడుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజా సంఘాలకు సూచించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ అక్రమ కేసు ఒక ఉదహరణ అని అన్నారు.