మినీ జాతరలను అభివృద్ధి చేస్తాం - మంత్రి సీతక్క

మినీ జాతరలను అభివృద్ధి చేస్తాం - మంత్రి సీతక్క

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: సమ్మక్క సారలమ్మ మినీ జాతరలను కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ములుగు నియోజకవర్గంలోని గుర్రంపేటలో గల శ్రీ సమ్మక్క సారలమ్మలను గురువారం మంత్రి సీతక్క, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జయశంకర్ జిల్లా  కలెక్టర్ భవిష్ మిశ్రా, ములుగు ఎస్పీ శబరీష్ తదితరులు దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ మినీ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపడతామన్నారు. జాతర కమిటీల నిర్వహకులు, ప్రజా ప్రతినిధులు అందరూ జాతరలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. మినీ జాతరలో భక్తులకు కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రూ.15 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిచ్చేయంతో ముందుకు సాగుతుందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతుందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెడితే కొంతమంది తమ దుర్బుద్ధిని ప్రదర్శిస్తున్నారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి విమర్శలను తీప్పికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలకు కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

మినీ జాతర ప్రాంగణాలను పరిశీలించిన ఎమ్మెల్యే..

భూపాలపల్లి నియోజకవర్గంలోని మినీ జాతర ప్రాంగణాలను గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాలు పరిశీలించారు. భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి గ్రామ శివారులో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు, కమలాపుర్ నుండి మేడారం వెళ్లే రహదారిలో గట్టమ్మ తల్లి గుడివద్ద ప్రమాదాలకు గురి అవుతున్న ప్రదేశాలను, రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్లను ఈ సందర్భంగా వారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో టీపిసిసి అధికార ప్రతినిధి గాదర్ల అశోక్, సభ్యులు మల్లాడి రాంరెడ్డి, ఎస్టీ సెల్ ములుగు జిల్లా అధ్యక్షులు భానోత్ రవిచందర్, పీసీసీ జనరల్ సెక్రెటరీ రవళి రెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షులు రేగ కళ్యాణి, వెంకటాపురం మండల అధ్యక్షులు చిన్నోజు సూర్యనారాయణ, ములుగు మండల అధ్యక్షులు చాంద్ పాషా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్, నల్లెల్ల భరత్, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు కోటి, ఎంపీటీసీ బానోత్ భాస్కర్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు మూడు వీరేష్ నాయక్, సీనియర్ నాయకులు శ్యాంసుందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఎండి వసీం, మిల్కురి ఐలయ్య, జిల్లా అధికార ప్రతినిధి కోడూరు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వేణి కుమార్, సర్పంచ్ సుమన్, పెద్దాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.