ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు... బిక్ష కాదు

ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు... బిక్ష కాదు

ప్రత్యేక హోదా  ఆంధ్రప్రదేశ్‌ కు సంజీవినీ వంటిదని, ఇది ఏపీ హక్కని.. బిక్ష కాదని మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి  అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మోదీ ప్రభుత్వం  పార్లమెంటులో చెప్పడం దుర్మార్గం, మోసమని అన్నారు. పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, పార్లమెంటులో ఎందుకు అంగీకరించిందని ఆయన ప్రశ్నించారు.

14వ ఆర్థిక సంఘం సిఫారసులకు, ప్రత్యేక హోదాకు ముడి పెట్టడం అంటే.. బోడి గుండుకు మోకాలుకు ముడి పెట్టడమేనని తులసిరెడ్డి అన్నారు. ఇది ఒక సాకు మాత్రమేనని, ఈ రెండిటికీ సంబంధమే లేదని 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అభిజీత్ సేన్, గోవిందరావులు కరాఖండిగా చెప్పారన్నారు. మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల 25 రోజుల వరకు 14వ ఆర్థిక సంఘం నివేదిక రాలేదని.. ఆ మధ్య కాలంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.  కేంద్రంలో బీజేపీ ... రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం.. ఏపీకి ప్రత్యేక హోదా రాదని తేలిపోయిందని తులసి రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీలో ప్రత్యేక హోదా అమలు అవుతుందని స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.