కాళేశ్వరం గుట్టురట్టు..! 

కాళేశ్వరం గుట్టురట్టు..! 
  • అక్రమాలు, అవినీతి లెక్క తేల్చిన కాగ్​
  • గుత్తేదారుకు అనుచిత లాభం రూ. 5,526 కోట్లు
  • ప్యాకేజీ పనుల్లో రూ. 14,501 కోట్ల అక్రమ చెల్లింపులు 
  • 17 ప్యాకేజీ పనులకు సంబంధించిన బిల్లులు మాయం
  • ప్రభుత్వ సలహాదారు ఇచ్చిన లెక్కలతోనే అంచనాల పెంపు 
  • ఈ ఏడాది ప్రాజెక్టు వ్యయం రూ 1,49,317 కోట్లు దాటుతుందని అంచనా

ముద్ర, తెలంగాణ బ్యూరో: వివాదస్పద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్నఅక్రమాలు, అవినీతి గుట్టు రట్టయింది. ప్రాజెక్టు అంచనాల తయారీ మొదలు..పరికరాల కొనుగోళ్ల వరకు ప్రతి వ్యవహారంలో జరిగిన రూ. వేల కోట్ల అక్రమ చెల్లింపులు, ప్రజాధనం దుర్వినియోగాన్ని కాగ్​ నివేదిక రూపంలో బట్టబయలు చేసింది. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, పారదర్శకత లేకుండా ఈ చెల్లింపుల ప్రక్రియ కొనసాగిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.  అదనంగా అనేక ఒప్పందాలలో ఎలాంటి లెక్కా, పత్రం లేకుండా రూ. వందల కోట్లు గుత్తేదార్లకు అప్పనంగా కట్టబెట్టారని కాగ్ తీవ్రంగా తప్పు బట్టింది. పైపెచ్చు కాంట్రాక్టర్లు అడిగిందే తడవుగా ఒప్పందాలను కాంట్రాక్టర్లకు అనుకూలంగా, నిబంధనలకు విరుద్దంగా మార్పులు చేశారనీ, దీనివల్ల అదనంగా వేలకోట్ల రూపాయల అనవసర చెల్లింపులు జరిగాయని తన నివేదికలో ప్రభుత్వాన్ని తూర్పార బట్టింది. ఇందులో ఎత్తిపోతల పంపులు, మోటార్ల సరఫరాలో కాంట్రాక్టర్లకు 327శాతం అనుచిత లాభాలు అందించినట్లు కాగ్​ ద్వారా బట్టబయలైంది.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 21 ఎత్తిపోతల ప్యాకేజీ పనులు ఉంటే అందులో ఇందులో కేవలం 4 ప్యాకేజీలలోని పంపులకు ప్రభుత్వం అంచనా విలువ కింద రూ 7,212 కోట్లు చూపించింది. కానీ కాంట్రాక్టర్లు సరఫరా చేసిన పంపుల వాస్తవ విలువ రూ 1,686 కోట్లు మాత్రమేనని ఆధారాలతో సహా బయటపెట్టింది. కేవలం ఈ పంపుల వ్యవహారంలోనే కాంట్రాక్టర్లకు ఏకంగా రూ. 5,528 కోట్లు అనుచితంగా లాభం రూపంలో అందించినట్లు వివరించింది. మిగిలిన 17 ప్యాకేజీలకు సంబంధించిన బిల్లుల్లోనూ భారీగా అవినీతి జరిగినట్లు ఆక్షేపించింది. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా, పారదర్శకత లేకుండా 17 ప్యాకేజీ పనుల అంచనాలు తయారు చేశారని స్పష్టం చేసింది. మరోవైపు వీటికి సంబంధించిన బిల్లులను కాగ్​కు అందజేయకుండా అధికారులు దాచిపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో మొత్తం 21 ప్యాకేజీ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు రూఢీ అయింది. అయితే ఈ మొత్తం అక్రమ, అవినీతి వ్యవహారంలో ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారుడు ఇచ్చిన లెక్కలతోనే అంచనాల రూపకల్పన, గుత్తేదార్లకు కాంట్రాక్టులు అప్పగించినట్లు గుర్తించిన కాగ్​ ఈ అంచనాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వివరాలు లేకపోవడంతో తప్పుబట్టింది. పంపులు, మోటార్ల అనుబంధ పనుల్లో కూడా రూ. వందల కోట్ల అక్రమాలు జరిగిందనీ, కాంట్రాక్టర్లు అడిగిందే తడవుగా ఒప్పందాలలో మార్పులతో రూ. వేల కోట్ల రూపాయల అనవసర చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది.

భారీగా పెరిగిన అంచనా వ్యయం..!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తే.. ఈ పనులను మొత్తం ఏడు లింకులుగా, ఇందులో ఒక్కో లింకును మొత్తం 56 ప్యాకేజీలుగా విడగొట్టారు. ప్యాకేజీల వారీగా టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. ఏడు లింకులు.. 56 ప్యాకేజీలతో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) రూ 81,911 కోట్లతో  ఆమోదం తెలపగా.. గతేడాది మార్చి వరకు అప్పటి ప్రభుత్వం రూ. 86,788 కోట్ల పై గానే  ఖర్చు చేసింది. ఈ ఏడాది వరకు ప్రాజెక్టు ఖర్చు రూ 1,49,317 కోట్లు దాటుతుందని కాగ్ అంచనా వేసింది. ప్రస్తుత పనుల వేగాన్ని పరిశీలిస్తే.. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు చాలా ఏళ్లు పట్టే అవకాశం ఉందని కాగ్ పేర్కొన్నది. 


పంపులు.. మోటార్ల కొనుగోళ్లలో రూ. 14,501 కోట్ల పక్కదారి..! కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు  పంపులు, మోటార్ల సరఫరా పనులలో వేలకోట్ల అక్రమ చెల్లింపులు జరిగినట్లు కాగ్​ గుర్తించింది.  మొత్తం 56 ప్యాకేజీలలో, 21 ప్యాకేజీలు ఎత్తిపోతలకు చెందిన పంపులు, మోటార్లకు సంబంధించినవి.  ఈ 21 ప్యాకేజీల ద్వారా 27 చోట్ల ఎత్తిపోత పథకాల నిర్మాణం చేపడుతుండగా.. అన్నిట్లో పంపులు, మోటార్ల సామార్ధ్యం  8,338 మెగావాట్లు ఉంది. 21 ప్యాకేజీల మొత్తం విలువ: రూ 18,936 కోట్లు ఉంది. అయితే స్టాండర్డ్​ షెడ్యూల్​ ఆఫ్​ రేట్స్​ (ఎస్​ఎస్​ఆర్​) ఆధారంగా ఖర్చు అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అయితే ఏటా ప్రభుత్వం ప్రచురించే ఎస్​ఎస్​ఆర్​లో ఏదైనా వస్తువు ధర లభ్యం కాకపోతే, ఆ ధరలను మార్కెట్ నుండి సేకరిస్తారు.  అయితే ఈ మోటార్లు, పంపుల ధరలు ఎస్​ఎస్​ఆర్​లో ఉండవు కాబట్టి మార్కెట్ ధరలు సేకరించాలి. గతంలో ప్రాణహిత-చేవెళ్ళ పనులకు ప్రభుత్వ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ సంస్థ (బి‌హెచ్‌ఈ‌ఎల్) నుండి ఈ ధరలు ప్రతిపాదన ద్వారా సేకరించేవారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పంపులు, మోటార్ల ధరలను ప్రభుత్వం  బీ‌హెచ్‌ఈ‌ఎల్ నుంచి సేకరించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ప్రభుత్వం సేకరించిన, నిర్ణయించిన ఈ ధరలను ఎక్కడ నుండి సేకరించారో అనే దానిపై ప్రభుత్వం వద్ద ఎలాంటి వివరాలు అందుబాటులో లేకపోవడం పరికరాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను తేటతెల్లం చేస్తోంది. ఈ ధరలను నిర్ణయించడంలో ఎలాంటి పారదర్శక పద్దతిని పాటించలేదని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే.. ఈ ధరలను ఖరారు చేయడంలో అప్పటి ప్రభుత్వ సలహాదారుడు అన్నీ తానై నడిపించినట్లు కాగ్ ఆరోపించింది. ఆయన నిర్ధారించి.. సూచించిన వ్యయమే పరికరాల కొనుగోలుకు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయని వివరించింది. జెన్కో నుండి పదవీ విరమణ చేసిన ఈ ఇంజనీర్ ను ప్రభుత్వం మే 5, 2015లో జీవో 294 ద్వారా ప్రభుత్వ సలహాదారునిగా నియమించిందన్న కాగ్​ సలహాదారుడు వేసిన అంచనాలకు ఆధారమెంటో ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. ఫలితంగా.. కాంట్రాక్టర్లకు భారీగా అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్ స్పష్టం చేసింది.

మచ్చుకు నాలుగు...!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చేపడుతోన్న మొత్తం 21 ప్యాకేజీ పనుల్లో నాలుగు ( 6,8,10,11) ప్యాకేజీ పనుల వివరాలను కాగ్​ స్వయంగా సేకరించింది. వీటిలో పంపుల, మోటార్ల సామర్ధ్యం మొత్తం 2805.76 మెగావాట్లు ఉండగా, ఈ పంపులను బీ‌హెచ్‌ఈ‌ఎల్ తయారు చేసి సంబంధిత కాంట్రాక్టర్ కు సరఫరా చేయగా 2017 -20  మద్యకాలంలో ఈ పనులు పూర్తయ్యాయి. కానీ పూర్తయినా ఈ నాలుగు పనుల్లో పంపుల బిల్లుల వివరాలను ప్రభుత్వం కాగ్​కు ఇచ్చేందుకు మొండికేసింది. దీంతో నేరుగా రంగంలో దిగిన కాగ్​.. నేరుగా ఆ పంపులు సరఫరా చేసిన బీహెచ్​ఈఎల్​ నుంచి వివరాలు సేకరించింది. పనుల్లో కాంట్రాక్టర్​తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఖరారు చేసిన అంచనా ఖర్చు : Rs 7212.34 కోట్లు, కానీ సదరు కాంట్రాక్టర్​ బీహెచ్​ఈఎల్​కు చేసిన వాస్తవ చెల్లింపులు రూ. 1,689.59 కోట్లే కావడం గమనార్హం.

ఈ లెక్కన గత సర్కార్​ సదరు కాంట్రాక్టర్​కు అప్పన్నంగా అక్రమంగా అందించిన వ్యయం రూ. 5,525.75 కోట్లు.. అంటే వాస్తవ పంపుల విలువ కన్నా సదరు గుత్తేదార్​కు ప్రభుత్వం చెల్లించిన అక్రమ వ్యయం 327.63 శాతం కావడంతో కాగ్​ ఖంగుతిన్నది. ఒప్పందం ప్రకారం ఒక్కో పంపునకు ప్రభుత్వం కాంట్రాక్టరుకు చేసిన సగటు చెల్లింపులు, ఒక్కో  మెగావాటుకు రూ. 257 లక్షలు కాగా కాంట్రాక్టర్ బీహెచ్​ఈఎల్​కు చెల్లించిన వాస్తవ మొత్తం, మెగావాటుకు రూ. 60 లక్షలు మాత్రమే కావడం పంపుల కొనుగోళ్లలో జరిగిన భారీ అవినీతికి అద్దంపడుతోంది. ఈ అక్రమాల లెక్క కేవలం నాలుగు ప్యాకేజీలకు సంబంధించినవే కావడం.. మిగిలిన 17 ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం కాగ్​కు ఇవ్వకపోవడంతో మిగతా ప్యాకేజీల్లోనూ భారీగా అక్రమ చెల్లింపులు జరిగినట్లు కాగ్​ అనుమానిస్తోంది. మొత్తం 21 ప్యాకేజీల విలువ రూ 18,936 కోట్లు కాగా పంపులు, మోటార్ల సరఫరాలోనే రూ 14,501 కోట్లు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అక్రమంగా చెల్లించిందని కాగ్​ నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి ఆయా పనులకు అయిన వ్యయం రూ. 4,435 కోట్లని తేల్చింది.

ఆ కొనుగోళ్ల లెక్కల్లేవ్​...
పంపులు, మోటార్ల ఉమ్మడి పరికరాలకు (కామన్ ఎక్విప్మెంట్) ఇతర పరికరాల చెల్లింపునకు సంబంధించిన లెక్కలు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేకపోవడాన్ని కాగ్​ తీవ్రంగా తప్పుబట్టింది. పంపులు, మోటార్లే కాకుండా పవర్ హౌసులలో వాడే ఇతర పరికరాలు- ఉదాహరణకు ఈవోటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్ సెట్, బ్యాటరీస్, స్విచ్ గేర్ బోర్డ్, ట్రాన్స్ ఫార్మార్లు, ఎర్థింగ్ మేరీరియల్ కొనుగోలు విషయంలో కూడా భారీ అవకతవకలు జరిగాయని కాగ్ నివేదించింది. 21 ప్యాకేజీ పనుల్లో ఉమ్మడి పరికరాలకు రూ. 1,282 కోట్లు గంపగుత్తగా చెల్లింపులు చేశారని మండిపడింది.. ఏ పనికి ఎంత చెల్లించారో, దానికి ఆధారం ఏమిటో అధికారులు వివరించలేక పోయారని కాగ్ తన నివేదికలో పేర్కొన్నది.   


ఒప్పందం మార్పుతో భారం..!
నిబంధనలకు విరుద్దంగా ఒప్పందాలలో మార్పులతో ప్రభుత్వంపై రూ. వేలకోట్ల మేర అదనపు భారం పడిందని కాగ్​ స్పష్టం చేసింది. ఓ వైపు ఎలాంటి పారదర్శకత లేకుండా పంపులు, మోటార్లు, ఇతర పరికరాలకు వేల కోట్ల రూపాయలు చెల్లించిన ప్రభుత్వం  కనీసం కాంట్రాక్టు నిబంధనలు పట్టించుకోలేదనీ నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టులు కుదుర్చుకున్న తరువాత ఒప్పందాలలో మార్పులు చేశారని కాగ్ పేర్కొంది. ఉదాహరణకు.. ధర సర్దుబాటు నిబంధన కింద స్టీలు, సిమెంటు ధరలలో వచ్చే మార్పులకు కాంట్రాక్టరే బాద్యుడని టెండర్లలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఈ నిబంధనలను పక్కన బెట్టిన ప్రభుత్వం సదరు గుత్తేదారుకు సిమెంటు, స్టీల్ ధరలలో వచ్చిన మార్పులకు అనుగుణంగా చెల్లింపులు చేసినట్టు తన నివేదికలో పేర్కొన్నది. ఇలా చెల్లింపులు చేయడం కాంట్రాక్టు నిబంధనలకు పూర్తి విరుద్దమనీ ఈ ఒప్పంద నిబంధనలు ఉల్లంఘనతో కాంట్రాక్టర్లకు 1342.48 కోట్ల అక్రమ చెల్లింపులు జరిగాయని కాగ్ అంచనా వేసింది.