వైభవంగా శ్రీ రామానుజ తిరు నక్షత్ర ఉత్సవాలు 

వైభవంగా శ్రీ రామానుజ తిరు నక్షత్ర ఉత్సవాలు 

ముద్ర న్యూరో, హైదరాబాద్: మౌలాలిలోని శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ నిర్వహిస్తున్న రామానుజ మందిరంలో  జగదాచార్యులు భగవద్రామానుజుల 1007వ తిరునక్షత్ర ఉత్సవాలు ఆదివారంనాడు వైభవంగా జరిగాయి. రామానుజ సర్కిల్ గా పేరొందిన ఆ ప్రాంతంలో ఆంజనేయ బృహన్మూర్తిని ప్రతిష్టించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

8వ  వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆచార్యమూర్తికి ఆరాధన, తిరుమంజనం, ఆచార్య అష్టోత్తర శతనామార్చన, భజ యతిరాజ స్తోత్ర సామూహిక పారాయణం తదితర సంప్రదాయ కైంకర్యాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సర్కిల్ చుట్టూ వాహనాలపై వెళ్లే వందలాది మంది ఆగి ఆచార్య దివ్యమంగళమూర్తిని దర్శించుకున్నారు. ప్రఖ్యాత సోలిస్ కంటి ఆస్పత్రి అధినేత రాము  ప్రతినెల ఆర్ద్ర నక్షత్రం రోజు భగవద్రామానుజుల విగ్రహమూర్తికి సంప్రదాయ ఆరాధనా కైంకర్యం నిర్వహిస్తుంటారు.  

ఆదివారం కూడా ఐదువందల మందికి పైగా ఆచార్య నివేదిత అన్న ప్రసాదాన్ని, 60లీటర్ల పెరుగుతో చేసిన మజ్జిగ పానీయాన్ని భక్తులకు అందించారు.  శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎం.ఎల్.ఏ బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పోరేటర్లు పి.దేవేందర్ రెడ్డి, జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్  జి.శ్రీనివాస్ రెడ్డి, పలువురు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైష్ణవశ్రీ సంఘ సభ్యులు,  సంప్రదాయగోష్ఠిలో పాల్గొన్నారు.