శ్రీశైలం,నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పునాదిరాలెత్తిన పెద్ద సుంకులయ్య!

శ్రీశైలం,నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు పునాదిరాలెత్తిన పెద్ద సుంకులయ్య!
  • ఉద్యమాల సామాజిక బాధ్యత గల కుటుంబం.
  • జీవన పోరాటంలో అలసిన అమరుడు పెరుమాళ్ళ సుంకన్న.
  • పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం. రాఘవాచారీ.

ముద్ర.వీపనగండ్ల: సామాజిక బాధ్యత కలిగిన కుటుంబంగా ఉంటూ.. సమాజంలో వెనకబాటుకు గురవుతున్న వారి తరఫున పోరుబాట పట్టి భూమికోసం, బడుగుల హక్కుల కై బాధ్యతగా సాగిన పెరుమాళ్ళ పెద్ద సుంకులయ్య కుటుంబాన్ని సమాజము మరియు ప్రభుత్వం గుర్తించవలసిన ఆవశ్యకత ఉందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం.రాఘవాచారి అన్నారు. చిన్నంబావి మండల కేంద్రంలో ఇటీవల ఆకస్మిక మృతి చెందిన పెరుమాళ్ళ సుంకులయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన మాట్లాడుతూ..ఎందరో వలస కార్మికులు ఉన్న పాలమూరు జిల్లాలో వలస కార్మికుడిగా, పేరు మోసిన మేస్త్రిగా ఉమ్మడి మండలంలో వివిధ గ్రామాలలో వందల ఇండ్లు నిర్మించిన మేస్త్రిగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న పెరుమాళ్ళ పెద్ద సుంకులయ్య మృతి ఆ కుటుంబానికి మరియు సమాజానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.
 శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి రాలెత్తిన కూలీలలో ఆయన ఒకరని మండల పరిధిలోని పెద్ద దగడ గ్రామానికి చెందిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి శ్రీశైలం పునాదిరాళ్లు మోయడం జరిగిందని ప్రాజెక్టు నిర్మాణం అనంతరం భూమి కోసం బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం తన కుటుంబంలో చదువుకున్న కుమారుడిని సైతం కురుమయ్య అలియాస్ రామన్న పోరాటంలో అమరుడయ్యాడని అన్నారు. దళిత హక్కుల సాధన కోసం పోరు బాటలో ఆ కుటుంబం ఎంతో శ్రమించిందని చిన్నంబావిలో అంబెడ్కర్ విగ్రహ ఏర్పాటు, బడుగు వర్గాల తరఫున ప్రశ్నిస్తూ.. జర్నలిస్టుగా వారి కుటుంబంలో మరో కుమారుడు కృష్ణా నదిలో దక్షిణ తెలంగాణ నీటి వాటా కోసం వెల్టూరు-గుందిమల్ల బ్యారేజ్ కోసం పోరాడుతున్న ఉద్యమకారుడు సైతం ఉన్నాడని అన్నారు.
2010 మలిదశ తెలంగాణ పోరాటంలో సైతం జేఏసీ మండల కన్వీనర్ గా ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఆ కుటుంబానికి దక్కిందని నిరంతరం పోరు బాటలో నడుస్తున్న త్యాగాల కుటుంబంగా సుంకులయ్య కుటుంబాన్ని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ గల కుటుంబం కావడంతో సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారని,
సమాజంలో అటడుగు వర్గాల తరఫున మేధావి వర్గం ఎప్పటికీ అండగా ఉంటుందని వారి కుటుంబానికి ఎల్లవేళలా చేదోడుగా ఉంటామని ఆయన అన్నారు. సుంకన్న  కుటుంబాన్ని ఉద్యమకారుల కుటుంబంగా గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి భార్యకు పెన్షన్ మంజూరు చేయాలని, అలాగే మూడు ఎకరాల భూమిని సైతం ప్రభుత్వం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కుటుంబాలకు చేదోడుగా నిలవాల్సిన ప్రభుత్వాలు అనచివేతకు గురి చేస్తున్నారని ఇది ప్రభుత్వం బాధ్యత రాహిత్యమని సామాన్యుల పాలిట గుదిబండగా మారోద్దని అండగా నిలవాలని అన్నారు.
 ఇటీవల సుంకులయ్య మృతి చెందడం బాధాకరమని వారి కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వనపర్తి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి యూసోఫ్, టీచర్ కురుమయ్య, శ్రీశైలం నిర్వాసితుల సంఘం నాయకులు రామచంద్ర సాగర్, పెద్ద మల్లయ్య, వెల్టూర్- గుందిమల్ల సాధన సమితి నాయకులు పెరుమాళ్ళ శ్రీనివాస్, కాశన్న యాదవ్, పెరుమాళ్ళ వెంకటేష్, తిరుపతయ్య, కురుమయ్య, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.