వాస్తవం మూస చదువులతోనే అసలు ముప్పు 

వాస్తవం  మూస చదువులతోనే అసలు ముప్పు 

‘మూస శిక్షణ ద్వారా ఇంజనీరు లేదా డాక్టర్ కావచ్చు. ల్యాబ్ లో సైంటిస్ట్ కూడా కావచ్చు కూడా. కానీ, ఇంటిలో, ఫ్యాక్టరీలో,  ఆసుపత్రిలో లేదా ల్యాబ్ లో అసలు సిసలు ఆవిష్కరణలుగానీ, విమర్శతో కూడిన సృజనాత్మకత గానీ అభివృద్ధి చెందే అవకాశం లేదు. భూమిని దున్నే రైతుకు కాకుండా, సన్యాసికి మాత్రమే ప్రశంసలు దక్కుతున్నప్పుడు, సైన్స్ లేదా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి కాకుండా ప్రశంసలు ఎవరికి అందుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నాలుగు గోడల మధ్య మూస పద్ధతిలో బోధన విధానాన్ని వీడనాడకపోతే  ప్రపంచ వ్యవస్థను విద్యార్థికి నేర్పడం కష్టమవుతుంది. దీనిపై మేధావి వర్గం తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంప్రదాయ జీవన విధానంలో సైన్స్ కూడా ఉంది. కానీ, నాటి ఆలోచనలు నేడు అమలు పరచకుండా, ఆధునిక అశాస్త్రీయ విధానం విద్యార్థిపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నం కార్పొరేట్ కుట్ర అని చెప్పవచ్చు.’ 

ఒక్క అపజయం పది విజయాలకు నాంది అంటారు. అంటే, ఒకసారి అపజయం పొందినవారు అక్కడే ఆగిపోకుండా పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా అని భావం. ఇతర జీవులకు, మనిషికి ఉండే తేడాలు రెండు. మొదటిది ఆలోచన, రెండవది ఊహించడం. ఈ రెండు ఉన్న జీవి మానవుడు మాత్రమే. ఈ విశ్వం సైన్స్ సూత్రాలపై ఆధారపడి సాగుతున్నది. వ్యక్తిగత విశ్వాసాలను పక్కనపెట్టి శాస్త్రీయంగా ఆలోచన చేసిన దేశాలు, జాతులు అభివృద్ధిలో ముందున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంప్రదాయ విద్యా విధానం, బోధన ( మూస పద్ధతి), విద్యార్థులలో, యువతలో శాస్త్రీయ ఆలోచనలు లేకుండా చేస్తున్నాయి. శాస్త్రీయంగా ఆలోచించేవారిని, ప్రశ్నించేవారిని అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరించడం వలన సమాజానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. భారతదేశంలో క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బౌద్ధమతం వర్ణ వ్యవస్థపై, విగ్రహారాధనపై తీసుకువచ్చిన మార్పు సమాజంపై ఎంతగానో ప్రభావం చూపింది. సమాజంలో సంస్కరణాలు తీసుకురావడానికి బుద్ధుని బోధనలతో అవకాశం ఏర్పడింది. బుద్ధుడి బోధనలో సైన్స్ మిళితమై ఉంది. ఏడో శతాబ్దంలో ముస్లింలు రావడంతో  కులాంతర, మతాంతర వివాహాలు చోటు చేసుకున్నాయి. చదువుకోవడానికి అవకాశం కల్పించిన మతం క్రైస్తవమే అని చెప్పాలి. ఆంగ్లేయుల ఆధునిక పరిపాలనా విధానం సాంప్రదాయిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపింది. 1950లో భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన న్యాయం, ఆధునిక విద్యా బోధన, మానవ హక్కులకు దారి చూపింది. అయితే, కొందరు చాందసవాదులు తమ విధానాలతో సామాజిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని తీసుకురావడంలో కృతకృత్యులయ్యారనే చెప్పాలి. 

సైన్సే తగిన పరిష్కారం
ఇటువంటి వ్యవస్థను సంస్కరించడానికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుంది. దీనికి ఆధునిక విద్యా విధానం ఎంతగానో అవసరం ఉంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం  పయనిస్తున్నదని ప్రభుత్వం చెబుతున్నది. యేటా భారీగా ప్రచురితమవుతున్న పరిశోధనా పత్రాలు అలా ఊదరగొడుతున్నాయి. కానీ, ఆయా పరిశోధనలు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నాయి? అన్న ప్రశ్న తలెత్తక మానదు. భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు ఆచార్య అజయ్ కుమార్ సూత్ ఇటీవల నాగపూర్ విశ్వవిద్యాలయం వేదికగా సాగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ మన శాస్త్రీయ ప్రచరణల నాణ్యతపై పెదవి విరిచారు. అత్యుత్తమ పరిశోధనలకు నెలవు కాలేకపోతున్న ఇండియా 138 దేశాల 2020– విజ్ఞాన శాస్త్ర సూచి( జీకే ఐ) లో 75 వ స్థానంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. పది లక్షల జనాభాకు దక్షిణ కొరియాలో 7,498 , జపాన్ లో 5,304 మంది పరిశోధకులు పనిచేస్తున్నారు.140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ఆ సంఖ్య కేవలం 255 మాత్రమే. మన విద్యా వ్యవస్థ మార్కుల ర్యాంకుల చక్రంలో ఇరుక్కుపోవడమే ఇందుకు కారణం. యువతకు సరి అయిన ప్రోత్సహం లేకపోవడం, బట్టీ పద్ధతి విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, మానవీయ శాస్త్రాలు ఆధునిక విద్యావ్యవస్థలో లేకుండా పోవడం ప్రస్తుతం మన చర్చించుకుంటున్న వ్యవస్థకు నిదర్శనం అని చెప్పాలి. 

సాగులో కొంత నయం
వ్యవసాయ రంగంలో కొంతవరకు ఆధునిక విధానం అమలులోనికి వచ్చింది. పత్తిలో బీటీ వన్, బీటీ టు అని రెండు రకాల వంగడాల సాగుకు మాత్రమే కేంద్రంలో గతంలో అనుమతించింది. కలుపు మొక్కలను నాశనం చేసే విషపూరిత రసాయనాలను తట్టుకొని బతికే అర్బిసైడ్ , టాలరెంట్( హెచ్ టీ) పత్తి వంగడాలను ఇండియాలో సాగుకు అనుమతించాలని అమెరికాకు చెందిన మోనోసాంట్ కంపెనీ ప్రభుత్వ అనుమతిని కోరింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే హఠాత్తుగా దానిని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఆ సమస్త విత్తనాలు అక్రమంగా మార్కెట్ లోనికి చొరబడ్డాయి. కలుపు మొక్కలను నివారించడానికి వాడే విషపూరిత రసాయనం ‘గ్లైపోసెట్ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రైతుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. ఇటువంటి ప్రమాదకర రసాయనాలు భారతదేశంలో విచ్చలవిడిగా అమ్ముడుపోతుంటే ప్రభుత్వం తీసుకునే చర్యలు మాత్రం శూన్యం. వ్యవసాయ రంగంలో వచ్చిన ఆధునికి మార్పులను అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇక్కడి భూములకు అనువైన వంగడాలను సృష్టించుకుంటేనే ఆహార ఆర్థిక భద్రతకు పూచీకత్తు లభిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు ఆవిష్కరించే కొత్త వంగడాల సాగుకు ముందుకు రాకుండా ప్రమాదకర బీటీ విత్తనాలను వినియోగించుకునే విధంగా మార్కెట్ వ్యవస్థ ఉంది. తెగుళ్లను, ఇతర సమస్యలను నియంత్రించి అధిక దిగుబడులను ఇచ్చే కొత్త వంగడాలను సృష్టించాలంటే ఆధునిక సైన్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం తప్పనిసరి. 

దానితో ఫలితం లేదు
మూస శిక్షణ ద్వారా ఇంజనీరు లేదా డాక్టర్ కావచ్చు. ల్యాబ్ లో సైంటిస్ట్ కూడా కావచ్చు కూడా. కానీ, ఇంటిలో, ఫ్యాక్టరీలో,  ఆసుపత్రిలో లేదా ల్యాబ్ లో అసలు సిసలు ఆవిష్కరణలుగానీ, విమర్శతో కూడిన సృజనాత్మకత గానీ అభివృద్ధి చెందే అవకాశం లేదు. భూమిని దున్నే రైతుకు కాకుండా, సన్యాసికి మాత్రమే ప్రశంసలు దక్కుతున్నప్పుడు, సైన్స్ లేదా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడికి కాకుండా ప్రశంసలు ఎవరికి అందుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. నాలుగు గోడల మధ్య మూస పద్ధతిలో బోధన విధానాన్ని వీడనాడకపోతే  ప్రపంచ వ్యవస్థను విద్యార్థికి నేర్పడం కష్టమవుతుంది. దీనిపై మేధావి వర్గం తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రాచీన సంప్రదాయ జీవన విధానంలో సైన్స్ కూడా ఉంది. కానీ, నాటి ఆలోచనలు నేడు అమలు పరచకుండా, ఆధునిక అశాస్త్రీయ విధానం విద్యార్థిపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నం కార్పొరేట్ కుట్ర అని చెప్పవచ్చు. కేవలం నమ్మకంతోనే రాకెట్ ప్రయోగించడం మన శాస్త్రీయత లోపాలను బయటపెడుతుంది. శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తులకు సమాజంలో కట్టుబాట్ల పేరుతో ఆంక్షలు విధించి నిర్బంధించడం జరుగుతుంది. దీనివల్ల విశ్వాసానికి యోగ్యత పెరిగి, శాస్త్రీయ విజ్ఞానానికి అయోగ్యత కలుగుతుంది.

డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
పీఆర్ఓ, కేయూ, వరంగల్
98495 77610