ఈసారి ఫుల్ బడ్జెట్

ఈసారి ఫుల్ బడ్జెట్

సిద్ధమవుతున్న ప్రతిపాదనలు

బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి మూడో వారం లేదా చివరి వారంలో ఈ సమావేశాలు జరగుతాయని అధికారులు చెబుతున్నారు.  ఈసారి సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చేదంతా ఎన్నికల సీజన్​ కావడంతో ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంతో పాటు బీసీ, మైనార్టీ వర్గాల సబ్సీడీ రుణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇరిగేషన్​ కూ ఈసారి నిధులు పెరుగనున్నాయి.

 అసెంబ్లీ బడ్జెట్‍ సమావేశాలను కూడా గవర్నర్‍ ప్రసంగం లేకుండానే కొనసాగించనున్నారు. రాజ్‍భవన్‍, ప్రగతిభవన్‍ మధ్య విభేధాలు ఇంకా సమసిపోలేదు. ఇరువర్గాల నుంచి ఎవ్వరూ తగ్గకపోవడంతో యేడాదిన్నర కిందట మొదలైన ఈ వివాదాలు మరింత ముదిరాయి.

  ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర బడ్జెట్​ పై కసరత్తు మొదలైంది. వచ్చేనెల చివరి వారంలోనే బడ్జెట్​ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ యేడాదే ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ ప్రవేశపెడుతారని భావించారు. కానీ, ఈసారి ఫుల్​ బడ్జెట్​ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖలు గతంతో పోలిస్తే దాదాపుగా 20 శాతం ఎక్కువ నిధులకు ప్రతిపాదనలు సమర్పించాయి. వాటిని సవరించేందుకు మళ్లీ ఆదేశాలిచ్చారు. ఇటీవల అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎస్ శాంతికుమారి ఇప్పుడిచ్చిన ప్రతిపాదనలను పది శాతానికి తగ్గించాలని సూచించినట్లు చెబుతున్నారు. ఇక, ఈసారి కూడా గవర్నర్​ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.

 సంక్షేమం.. ఇరిగేషన్ కు ప్రాధాన్యం​

బడ్జెట్​లో ఈసారి సంక్షేమానికే ఎక్కువ నిధులు కేటాయించనున్నారు. వచ్చేదంతా ఎన్నికల సీజన్​ కావడంతో, ఈ నిధులపై ప్రచారం చేసుకోవడం అధికార పార్టీకి అనివార్యంగా మారుతోంది. దీంతో ఈసారి వివిధ సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంతో పాటుగా బీసీ, మైనార్టీ వర్గాల సబ్సీడీ రుణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గత కొన్నేండ్లుగా సబ్సిడీ రుణాలను ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆసరా, కళ్యాణలక్ష్మి వంటి స్కీంలకు నిధులు పెరిగే ఛాన్స్​ ఉంది. ఆ తర్వాత ఇరిగేషన్​ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరిగేషన్​ కు రూ. 13,300 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ, దాదాపు 8 వేల కోట్ల పెండింగ్​ బిల్లులున్నాయి. వీటితో పాటుగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాల్సిన పరిస్థితులున్నాయి. పాలమూరు ప్రాజెక్టుకు ఆర్థిక సంస్థలు అప్పులు ఇవ్వకపోవడంతో ఈ పనుల భారం ప్రభుత్వంపైనే పడుతోంది. దీంతో ఇరిగేషన్​ కు ఈసారి నిధులు పెరుగనున్నాయి.

 

తొలిసారి గిరిజనబంధు

వీటితో పాటుగా దళిత బంధు, గిరిజన బంధు, రైతుబంధుకు నిధుల కేటాయింపు చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్​ గిరిజన బంధును ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం వచ్చే బడ్జెట్​ లో ఫండ్స్​ ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ పథకం  ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. రైతుబంధుకు సైతం కొంతమేర నిధులు పెరుగనున్నాయి.

 ఇంటి నిర్మాణానికి సాయం

సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేందుకు సైతం ఈ బడ్జెట్​ లో నిధులు కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖను ఎత్తివేయడంతో, ఆర్​అండ్​ బీ కింద ఈ నిధులు కేటాయించనున్నారు. అయితే, ప్రతి సెగ్మెంట్​ లో కనీసం 50‌‌‌‌0 మందికి ఆర్థిక సాయం పథకం అమలు చేయనున్నారు. దీంతో ఆరేడువేల కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా నిర్మాణాలు మధ్యలో ఆగిన డబుల్​ ఇండ్లకు కూడా ఈసారి నిధులు ఇవ్వనున్నారు.

 20 శాతం మేర పెరిగిన బడ్జెట్​

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.56 లక్షల కోట్ల బడ్జెట్​ ను ప్రకటించిన ప్రభుత్వం.. ఈసారి ప్రతిపాదనలకు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా శాఖల నుంచి 20 శాతం పైమేరకు ప్రతిపాదనలు పెంచగా.. కొత్తగా గిరిజన బంధు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం వంటి పథకాల నిధులు చేరాయి. దీంతో 20 శాతం మేరకు పెరిగిన శాఖలలో 10 శాతానికి తగ్గించి ప్రతిపాదనలు చేయాలని సీఎస్​ సూచించారు.ఈ నెలాఖరు వరకు అన్ని శాఖలు ఈ ప్రక్రియను కంప్లీట్​ చేయనున్నాయి.

 గవర్నర్‍ ప్రసంగం లేకుండా?

రాజ్‍భవన్‍, ప్రగతిభవన్‍ మధ్య విభేధాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి పర్యటనలో గవర్నర్​ తో సీఎం కేసీఆర్​ సమావేశమయ్యారు. తాజాగా బీఆర్​ఎస్​ సభలో చేసిన ప్రకటనతో మళ్లీ గవర్నర్​ నుంచి ఘాటు రిప్లై వచ్చింది. యేడాదిన్నర కిందట మొదలైన ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో వచ్చే అసెంబ్లీ బడ్జెట్‍ సమావేశాలను కూడా గవర్నర్‍ ప్రసంగం లేకుండా కొనసాగించనున్నారు. ఫిబ్రవరి మూడో వారం లేదా చివరి వారంలో ఈ సమావేశాలు జరగనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొందరు అధికారులు చెబుతున్న ప్రకారం ఈసారి కూడా అసెంబ్లీ ప్రోరోగ్‍ చేయడం లేదని, గత బడ్జెడ్‍ సమావేశాలకు కొనసాగింపుగానే ఉంటాయంటున్నారు. దీంతో కేసీఆర్‍ మరోసారి తమిళి సై లేకుండా అసెంబ్లీ సమావేశాలు రన్‍ చేయనున్నారు.