త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు

త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవు
  • తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయా

ముద్ర/వీపనగండ్ల:- ఉమ్మడి పాలమూరు జిల్లాలో  తాగునీటి అవసరాలకు కావాల్సిన నీళ్లు రిజర్వాయర్లో పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానీయా అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోపాల్ దిన్నె జలాశయాన్ని పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రతి రిజర్వాయర్లో నీటి నిల్వలను పరిశీలించటం జరిగిందని, జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత అధికారులతో మంచినీటి సమస్యపై రివ్యూ చేయడం జరిగిందని వివరించారు.జులై, ఆగస్టు నెల వరకు మంచినీళ్లకు ఎలాంటి సమస్య లేదని, ప్రతి ఇంటెక్ వెల్ వద్ద పంపులు కూడా బాగానే పనిచేస్తున్నాయని, గద్వాల వనపర్తి జిల్లాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీటిని పుష్కలంగా అందించడం జరుగుతుందని, ఎక్కడో ఒకచోట పైపులైన్ లీకేజీల వల్ల నీటి సమస్య ఏర్పడితే సంబంధిత అధికారులు 24 గంటల్లోపే పైపులను రిపేర్ చేయించి నీటి సరఫరా చేస్తున్నారని, అంతేకాక రాత్రిళ్ళు కూడా ఎక్కడైనా పైప్ లైన్ ల వల్ల నీటి సమస్య ఏర్పడితే అధికారులు వెంటనే వెళ్లి బాగు చేయిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లు తో, మిషన్ భగీరథ అధికారులతో నీటి సమస్యపై ప్రతిరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలలోని ఏ గ్రామాల్లో కూడా నీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉంటూన్నారని అన్నారు. జిల్లాలోని కలెక్టర్లు కూడా ప్రతిరోజు మంచినీటిపై అధికారులను అప్రమత్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, మిషన్ భగీరథ ఈఈ మేఘా రెడ్డి, తో పాటు జూరాల, మిషన్ భగీరథ అధికారులు, తాసిల్దార్ వరలక్ష్మి ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.