సహా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలి

సహా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పాలి

  • మాజీ సమాచార హక్కు చట్టం కమిషనర్ వెంకటేశ్వర్లు పిలుపు

ఆలేరు ముద్ర: దేశంలోని ప్రజలందరికీ సమాన స్థాయిలో పాలన అందించేందుకు, ప్రభుత్వం నుండి తమకు అందే పథకాలను తెలుసుకునేందుకు నాటి  యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టాన్ని నేటి బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను దేశంలోని మేదావులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు తిట్టికొట్టేందుకు ముందుకు రావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ కుర్షిద్ పాసా ఆధ్వర్యంలో నిర్వహించిన సమాచార హక్కు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేసేందుకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో అనేక ప్రయత్నాలలో భాగంగానే సమాచార హక్కు చట్టం కోసం కృషి చేసినట్లు తెలిపారు. సాక్షాత్తు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తాను దేశంలోనే ప్రజలకు ఒక్క రూపాయి కేటాయిస్తే అందులో నుండి 18 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతూ మిగతా 82 పైసలు మధ్యవర్తుల చేతులలో ఆగిపోవడాన్ని గుర్తించి అనేక సందర్భాలలో అవినీతి నిర్మూలన కోసం మేధావులతో చర్చలు జరుపుతూ అవినీతి నిర్మూలన కోసం కృషి చేసినట్లు తెలిపారు.

మహాత్మా గాంధీ కన్న కలలను నిజం చేస్తూ, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ లో సమాచార హక్కు చట్టానికి చట్టబద్ధత కల్పించి దేశ ప్రధాని నుండి సామాన్య ప్రజల వరకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకునేందుకు రూపకల్పన చేసినట్లు వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో తీసుకువచ్చిన అనేక చట్టాలను నేటి ప్రధాని నరేంద్ర మోడీ నిర్వీర్యం చేస్తూ దేశ ప్రజలకు పారదర్శకంగా అందించాల్సిన సేవలను అందకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రలు పన్నడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే అదునుగా భావించి రాష్ట్రాల వారిగా సమాచార హక్కు కమిషనర్లను నియమించకుండా సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ సమాచార హక్కు చట్టంపై ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ కుట్రలను అన్ని వర్గాల ప్రజలు తిప్పి కొట్టి సమాచార హక్కు చట్టాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రపంచ ఇండెక్స్ లో సమాచార హక్కు చట్టం రాకముందు, వచ్చిన తరువాత జరిగిన అంశాలపై జరిగిన అధ్యయనంలో సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి నిర్మూలన చాలావరకు సాధ్యం అయ్యిందని వివరించారు. దేశ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి నష్టపోయినప్పటికీ ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగిందని అన్నారు. లౌకిక వాదం సౌమ్యాన్ని రక్షించేందుకు కవులు, కళాకారులు, పాత్రికేయులు, మేధావులు, సమాచార హక్కు చట్టం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ రానున్న పార్లమెంటు ఎన్నికలలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కోసం బిజెపి పార్టీని, అభ్యర్థులను ఓడించాల్సిన బాధ్యత స్వీకరించాలని పిలుపునిచ్చారు.