తెలుగు రాష్టాల్ల్రో రాజకీయ ఎత్తులు..!

తెలుగు రాష్టాల్ల్రో రాజకీయ ఎత్తులు..!
telugu states politics

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. పరిస్థితులను, పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. సెంటిమెంట్లతో ముందుకు సాగేలా పరిస్థితులను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో మరోమారు విభజన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి  కవితపై సిబిఐ విచారణను వీరోచితంగా మలచుకునేలా కెసిఆర్‌ వ్యూహాలు పన్నుతున్నారు. విభజన చట్టంపై మాజీ ఎంపి ఉండవల్లి మాటలను తమకు అనుకూలంగా మలచుకుని మళ్లీ సెంటిమెంట్‌ రెచ్చగొట్టే పనిలో వైసిపి ఉంది. దీనిని తెలంగాణలో కూడా బిఆర్‌ఎస్‌ ఇప్పుడు మరింత రాజేస్తోంది. మొత్తంగా మళ్లీ అధికారం లక్ష్యంగా రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి. సుప్రీంకోర్టు సూచిస్తే రెండు తెలుగు రాష్టాల్రు మళ్లీ కలసిపోవాలన్నదే తమ పార్టీ విధానమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన ప్రకటన వెనక పెద్ద వ్యూహం దాగి వుంది. విభజనకు తాము మాత్రమే వ్యతిరేకంగా నిలిచామని,జగన్‌ చివరి వరకు విభజన జరగగకుండా అడ్డుకున్నారని చెబుతూ ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు జగన్‌ పట్ల సానుకూలత చూపి మళ్లీ తమవైపే ఉంటారన్న వ్యూహం దాగివుంది. సజ్జల ప్రకటనను తెలంగాణలో తమకు అనుకూలంగా మలచుకోవాలన్న యత్నాలను బిఆర్‌ఎస్‌ కూడా చేపట్టింది.ఇక్కడ బిఆర్‌ఎస్‌, అక్కడ వైసిపిలు ఇలా పరస్పరం తమకు అనుకూలంగా పరిస్థితులు మలచుకుంటున్నాయి. సజ్జల ప్రకటనపై తెలంగాణలో వివిధ పార్టీల నాయకులు విమర్శలు గుప్పించారు. తెలంగాణను అవమానిస్తున్నారని విమర్శలకు పదను పెట్టారు. అయితే ఎపిని మళ్లీ తమిళనాడులో కలుపుతారా అని విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయ్యాక ఇప్పుడు సజ్జల మళ్లీ కలసిపోవడానికి సిద్ధమని ప్రకటించడంలో రాజకీయ వ్యూహం లేకుండా మాట్లాడలేదని గమనించాలి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు, ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దీనిని తప్పు పట్టడంతో రాష్ట్ర విభజన సక్రమంగా జరగ లేదన్న పిటిషనర్ల అభిప్రాయంపై మాట్లాడకుండా రెండు రాష్టాల్రూ మళ్లీ కలసిపోతే మంచిదే అని సజ్జల మాట్లాడటం రాజకీయంగా దుమారం లేపడానికే అన్నది ప్రతి ఒక్కరూ భావిస్తున్నాదే. సజ్జల ప్రకటన తర్వాత తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు, అధికార బిఆర్‌ఎస్‌ నాయకులు విమర్శలు అందుకున్నారు. ఆంధ్రా కుట్రలు మళ్లీ మొదలయ్యాయని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రగిలించడంతో ముందుకు సాగుతున్నారు. మరోవైపు ఉండవల్లితో కెసిఆర్‌ ఇప్పటికే మంతనాలు జరిపారు. ఉండవల్లి వ్యాఖ్యలు,దానికి సజ్జల వ్యాఖ్యలు తోడవడం అంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్నదే అన్న సంగతి గమనించాలి. పార్టీ గురించి ఉండవల్లితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ మధ్య సుదీర్ఘంగా మంతనాలు జరపడం,కేసీఆర్‌ తన పార్టీ బిఆర్‌ఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తరించవచ్చునని ఉండవల్లిని దగ్గరకు తీసుకున్నారన్న ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయడంతో..తెలంగాణ సెంటిమెంటును రగిలించి ఎన్నికల్లో కెసిఆర్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సజ్జల వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని మరోమారు తెలంగాణ సెంటిమెంట్‌తో ముందుకు పోవాలన్న కెసిఆర్‌ వైఖరిని అర్థం చేసుకోవాలి. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్‌  
మళ్లీ తెలంగాణ సెంటిమెంటు అస్త్రాన్ని అందించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కవితపై కేసులను కూడా కెసిఆర్‌ తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. విభజన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత సజ్జల మళ్లీ కలసిపోదామని ప్రకటించడం ద్వారా ఎపిలోనూ విభజన గాయాలు రగిలించే యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సజ్జలతో పాటు మంత్రులు కూడా ఇదే రాగం అందుకున్నారు. కలసిపోదాం అన్న భావనతో ప్రజల్లోకి వెళ్లాలన్న రాజకీయ వ్యూహం పన్నుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని తెలుసు. అయినా వైసీపీ నాయకులు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రంలోని ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం ఒక ఎత్తు. ఎన్నికల్లో మళ్లీ అనుకూలతను సాధించడం మరో ఎత్తు. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ప్రస్తుతం అధ్వాన్నంగా ఉంది. దీనిని గట్టెక్కడంతో పాటు విపక్ష టిడిపి దూకుడును అడ్డుకోవాల్సి ఉంది. టిడిపికి అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. టిడిపి అధినేత ప్రచారాలు, యాత్రలు వైసిపికి మింగుడు పడడం లేదు. పైకి వైసిపి గాంభీర్యం ప్రకటిస్తున్నా..లోపల మాత్రం ఎన్నికలను గట్టెక్కేదెలా అన్న భయంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎపి సెంటిమెంట్‌ రగిల్చేలా చేస్తున్నారు. వైసిపి వ్యూహం ఇక్కడ కెసిఆర్‌కు కలసివచ్చేలా కూడా ఉంది. ఇప్పుడు తెలుగు రాష్టాల్రు మళ్లీ కలసిపోతాయని చెప్పడం కూడా రాజకీయ ఎత్తుగడ తప్ప మరోటి కాదు. మొత్తంగా రానున్న ఎన్నికల నాటికి ఈ వ్యవహారం మరింత ముదరనుంది. తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.