తెలంగాణపై ఉగ్ర నీడ!

తెలంగాణపై ఉగ్ర నీడ!
  • రాష్ట్రంలో పీఎఫ్ఐ, హిజ్జుత్​తహ్రీర్​మూలాలు
  • యువతను ఆకర్శించే పనిలో ఉగ్ర సంస్థలు?
  • కరీంనగర్, ఆదిలాబాద్​లో ఎన్‌ఐఏ సోదాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణపై ఉగ్ర నీడ పడింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్​ఇండియా(పీఎఫ్ఐ), అంతర్జాతీయ ఇస్లామిక్ రాడికల్స్​సంస్థ హిజ్జుత్​తహ్రీర్​కార్యకలాపాలు రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. రెండు నెలల వ్యవధిలోనే హైదరాబాద్ తో పాటు భోపాల్, పలు నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హైదరాబాద్​కు చెందిన హిజ్జుత్​తహ్రీర్​సానుభూతిపరులు ఐదుగురిని భోపాల్​యాంటీ టెర్రరిస్ట్​స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

  • రంగంలోకి ఎన్ఐఏ..

నగరంలో ఊహించని విధంగా ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని భావిస్తున్న కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)ను రంగంలో దింపింది. దీంతో ఉగ్ర కార్యకలాపాలపై దృష్టి సారించిన ఎన్ఐఏ.. ఇటీవల పట్టుబడ్డ ఐదుగురు నిందితుల సహచరుడు.. జవహర్​నగర్​కు చెందిన సల్మాన్​ను ఆగస్టు 1న రాజేంద్ర నగర్​లో అరెస్ట్​ చేసి వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. మరోవైపు.. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో తబ్రేజ్ అనే వ్యక్తికి నిషేదిత పీఎఫ్ఐ తో లింకులున్నాయనే అనుమానంతో అతని ఇంటితో పాటు హుస్సేనీపుర, కార్ఖానాగడ్డ, అహ్మద్​పురలో పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. అలాగే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు రాష్ట్ర సరిహద్దు జిల్లా కర్నూల్​నగరంలోనూ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. కాగా తెలంగాణతోపాటు ఏపీలోనూ చాలా మంది యువతకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఐఎన్ఏ హైదరాబాద్​లో మకాం వేసి అదనపు బలగాలతో ఇరు రాష్ట్రాల్లో ఏకకాల దాడులకు దిగేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  • సేవ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు..

న్యాయం, స్వేచ్ఛ, స్వీయరక్షణతో ప్రజలను శక్తివంతుల్ని చేయాలనే ఉద్దేశంతో 2006లో కర్ణాటక ఫోరమ్ ఫర్ డిగ్నిటీ(కేఎఫ్ డీ), నేషనల్ డెవలప్‌మెంట్ ఫ్రంట్(ఎన్డీఎఫ్​) విలీనమై పీఎఫ్ఐగా ఆవిర్భవించింది. అయితే ఈ పార్టీ సేవ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు దిగుతున్నట్లు స్థానిక పోలీసుల విచారణ నివేదికల ఆధారంగా కేంద్రం గుర్తించింది. దీంతో భారత హోం మంత్రిత్వ శాఖ చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ) చట్టం కింద 28 సెప్టెంబర్ 2022న పీఎఫ్ఐను ఐదేళ్ల పాటు నిషేధించింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో పీఎఫ్ఐ కార్యకలాపాలు రహస్యంగా సాగుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంది. ఇదే క్రమంలో గతేడాది జూన్​లో నిజామాబాద్​లో శిక్షణ కేంద్రంపై దాడి చేసిన అక్కడి ఆరో పట్టణ పోలీసులు ఖాదర్​తోపాటు మరో ముగ్గురు యువకులకు అరెస్ట్ చేసింది. వారి నుంచి పీఎఫ్ఐ కు చెందిన కీలక సమాచారం రావడంతో ఎస్పీ స్థాయి అధికారి రంగంలో దిగి వివరాలు సేకరించారు. దీంతో అప్పటి నుంచి కేసు దర్యాప్తు తీరుతెన్నులు మారిపోయాయి.

  • ఆత్మరక్షణ పేరిట ఆకర్షణ..

తాజాగా హైదరాబాద్​తోపాటు పలు జిల్లాల్లో ఉపాధి లేని నిరుపేద యువతను ఆత్మరక్షణ పేరిట కరాటే శిక్షణ, సేవా కార్యక్రమాల ముసుగులో పీఎఫ్ఐ ఉగ్ర కార్యకలాపాల్లో దించుతుందని ఎన్ఐఏ భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో యువతపై పీఎఫ్ఐ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు షరియా చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఇస్లామిక్​ రాడికల్స్​సంస్థ హిజ్జుత్​తహ్రీక్ ఉగ్ర సంస్థ సైతం కార్యకలాపాలకు శ్రీకారం చుట్టిన విషయం ఇటీవల వెలుగు చూసింది. ఇందులోభాగంగా హైదరాబాద్, భోపాల్​తో పాటు పలు నగరాల్లో విధ్వంసానికి కుట్ర పన్నిన హిజ్జుత్​తహ్రీక్ సానుభూతిపరులను గుర్తించేందుకు అంతర్జాతీయ నిఘా సంస్థ స్వయంగా రంగంలో దిగింది. ఈ సంస్థ దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్న యువతను తమ ఉచ్చులోకి లాగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుందని నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

  • ఉన్నత చదువుల కోసం వెళ్లి ఐఎస్‌ఐఎస్‌ ఉచ్చులో..

పదేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా(ఐఎస్‌ఐఎస్‌) ఉచ్చులో పడ్డారు. ఉగ్రవాద సంస్థ విధ్వంస కుట్రకు నిరాకరించడంతో అతన్ని అక్కడే కిరాతకంగా చంపేసిన సంఘటన అప్పట్లో ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కేంద్ర నిఘా సంస్థల దాడులు కలకలం రేపుతున్నాయి.