వరుస భేటీలతొ ఠాక్రే? 

వరుస భేటీలతొ ఠాక్రే? 

ఎవరి గౌరవం వారికి దక్కేలా చూస్తాను’’.. చెప్పడానికి చాలా సింపుల్‌ గా ఉంది ఈ వాక్యం. కానీ ఆచరణలో దీన్ని వందశాతం పాటించాలంటే ఎన్నో అడ్డంకులు. ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీగా కొత్తగా నియమితులైన మాణిక్‌ రావు ఠాక్రేకు తెలియనిది కాదు. అయితే ‘‘అయినను హస్తినకు పోయి రావలె..’’ అన్న చందంగా అసంతృప్త నేతలందరికీ హావిూ ఇచ్చేశారు ఠాక్రే. వారందరికీ దక్కాల్సిన గౌరవం దక్కేలా చూస్తానని చెప్పడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలను తాను రంగంలోకి దిగిన తొలి రోజే ప్రారంభించారు. దాంతో టిపిసిసి హెడ్‌ క్వార్టర్‌ గాంధీభవన్‌ జనవరి 11వ తేదీన కొత్త కళను సంతరించుకుంది. రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్‌ వచ్చిన మాణిక్‌ రావు ఠాక్రే వచ్చి రావడంతోనే రంగంలోకి దిగారు. శంషాబాద్‌ ఎయిర్పోర్ట్‌ నుంచి గాంధీభవన్‌ చేరుకున్నా మాణిక్‌ రావు ఠాక్రే తొలుత టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితోను, ఆ వెంటనే సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క తోను సమాలోచనలు జరిపారు. పార్టీలో ఐక్యత సాధించే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారిద్దరితో చర్చించారు. ఆ తర్వాత ముఖ్య నాయకులతో ముఖాముఖి భేటీ అవ్వడం ద్వారా వారి ఆలోచనలు తెలుసుకొనే ప్రయత్నం చేశారు. పార్టీ ముఖ్య నేతల మధ్య నెలకొన్న అంతరాన్ని తాను అవగాహన చేసుకుని, ఆ తర్వాత వాటిని సరిదిద్దేందుకు కార్యాచరణ అమలు పరచడం మొదలుపెట్టారు. రోజంతా ఈ మంతనాలు కొనసాగాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి దాటేదాకా ఈ సమావేశం కొనసాగింది అంటే మాణిక్‌ రావు తెలంగాణ వ్యవహారాలను ఎంత సీరియస్‌ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం కల్పించినట్లు గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి..? కాంగ్రెస్‌ పార్టీకి లాబించే అంశాలు ఏవి ? కెసిఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఏరకంగా ఎండ కడతారు? బిజెపి దూకుడును నివారించాలంటే ఏమేం చర్యలు తీసుకోవాలి..? వంటి కీలక అంశాలపై పీఏసీ సభ్యులతో ఠాక్రే సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. ఠాక్రేతో భేటీ అయిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఎక్కువమంది రేవంత్‌ రెడ్డి ఒంటెద్దు పోకడలను తప్పు పట్టినట్లు సమాచారం. రేవంత్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా నాయకులందరినీ కలుపుకొని పోతేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించగలదని వారిలో ఎక్కువ శాతం మంది ఠాక్రేకు వివరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వం విూద వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మలచుకునేందుకు అంతా ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని వారంతా నొక్కి చెప్పారు. రోజంతా ముఖాముఖి భేటీలు, రాత్రి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలను విన్న ఠాక్రే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కేల చూస్తానని హావిూ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలు రచ్చకెక్కిన నేపథ్యంలో పరిస్థితిని చక్కటిందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ని అధిష్టానం హైదరాబాద్‌ పంపింది. ఆయన కూడా రెండు రోజులపాటు హైదరాబాదులో మకాం వేసి రాష్ట్రస్థాయి నేతలందరితోనూ భేటీలు నిర్వహించారు. అందరికీ న్యాయం చేస్తానన్న హావిూతో ఆయన తిరిగి వెళ్లారు. తిరిగి వెళుతూవెళుతూ పార్టీ అంతర్గత వ్యవహారాలపై విూడియాకు ఎక్కవద్దని వార్నింగ్‌ కూడా ఇచ్చి వెళ్లారు. ఇదంతా జరిగి 20 రోజులు అయింది. ఈ మధ్యకాలంలో దిగ్విజయ్‌ సింగ్‌ సూచన మేరకు ఏ అసంతృప్త నేత కూడా రేవంత్‌ రెడ్డితో మమేకమై పని చేసేందుకు ముందుకు రాలేదు. సీనియర్ల డిమాండ్‌ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి బాధ్యతల నుంచి మాణిక్కం ఠాగూర్‌ని తప్పించి ఆయన స్థానంలో మాణిక్‌ రావు ఠాక్రేకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. పార్టీలో సామాజిక వర్గాల వారీగా ఎవరి బలం ఎలా ఉంది? ఏ ఏ సామాజిక వర్గం పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది? ఇలాంటి అంశాల పైన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో ఠాక్రే చర్చలు జరిపారు. జనవరి 26వ తేదీన ప్రారంభం కానున్న హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర ఏర్పాట్ల పైన కూడా మాణిక్‌ రావు సవిూక్ష నిర్వహించారు. 

దళిత, గిరిజన ఆత్మగౌరవ సభల నిర్వహణ తదితర అంశాల పైన కూడా ఆయన సమాలోచనలు జరిపారు. రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క తోపాటు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, షబ్బీర్‌ అలీ తదితర సీనియర్‌ నేతలతో కాస్త ఎక్కువ సమయం చర్చలు జరిపిన ఠాక్రే.. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గాంధీ భవన్‌ కు రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. అయితే, వెంకటరెడ్డి గాంధీభవన్‌కు రానని.. బయట ఎక్కడైనా కలుస్తానని చెప్పడంతో తన పర్యటన రెండవ రోజున జనవరి 12న వెంకటరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మరో సీనియర్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీభవన్‌ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. అయితే, జగ్గారెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారని, అందుకే ఠాక్రేతో సమాలోచనలకు రాలేదని గాంధీభవన్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి. ఇక రేవంత్‌ రెడ్డి వర్గం నేతలుగా ముద్రపడిన ఎమ్మెల్యేలు సీతక్క, పోడెం వీరయ్య ఠాక్రే తొలి రోజు పర్యటనలో కనిపించలేదు. మాణిక్‌ రావు ఠాక్రే పర్యటన మూలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న చిన్నాచితకా విభేదాలు సమసిపోయినట్లేనని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వెల్లడిరచారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి, అసంతృప్తి సమసిపోయాయా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. డిసెంబర్‌ నెలలో దిగ్విజయ్‌ సింగ్‌ వచ్చి వెళ్లిన తర్వాత కూడా సీనియర్లు రేవంత్‌ రెడ్డికి దూరంగానే ఉన్నారు. చివరకు మాణిక్‌ రావు ఠాక్రేని నియమించిన తర్వాత సీనియర్లలో కొద్దిపాటి కదలిక వచ్చింది. అయితేనేం రేవంత్‌ రెడ్డి ఏకపక్ష విధానాలపై ఇప్పటికీ పలువురు నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. జనవరి 26వ తేదీన ప్రారంభం కానున్న పాదయాత్ర సందర్భంగా సీనియర్లు అందరూ కలుపుకొని పోతానన్న రేవంత్‌ రెడ్డి ఆ మాటలను తన చేతలలో చూపితేనే తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు సమసిపోయే అవకాశం ఉంది. ఎన్నికలకు ఎంతో సమయం లేనందున రేవంత్‌ రెడ్డి తన ఏకపక్ష విధానాలకు పూర్తిస్థాయిలో స్వస్తి పలుకుతారా అన్నది ఇప్పుడే తేలని అంశం. అదే సమయంలో అందరికీ తగిన గౌరవం దక్కేలా చూస్తానని మాణిక్‌ రావు ఠాక్రే ఇచ్చిన హావిూ ఏ మేరకు అమలవుతుందన్నది కూడా ప్రశ్నార్ధకమే. ఎందుకంటే ఎవరి అంచనాలు వారికి వుంటాయి. అందరి అంచనాలను అందుకోవడం దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో దివంగత వైఎస్సార్‌ అమలు చేసిన మధ్యేమార్గ విధానం అనుసరణీయం. దాన్ని అందిపుచ్చుకోవడంలో రేవంత్‌ రెడ్డి ఏ మేరకు సఫలమైతే పార్టీలో నెలకొన్న పరిస్థితులు అంత త్వరగా గాడిలో పడే అవకాశం వుంది. రేవంత్‌ రెడ్డి వైఖరిలో ఖచ్చితమైన మార్పు కనిపిస్తేనే పార్టీ అధిష్టానం కోరుకున్న ఐక్యత తెలంగాణ కాంగ్రెస్‌లో వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి.