పొంగిపొర్లుతున్న వాగులు – నిలిచిన రాకపోకలు
- తెగిన బీమా కాలువ కొట్టుకపోయిన వరి పంట పొలాలు
- ఇండ్లలో ఉబికి వస్తున్న ఊట నీరు
ముద్ర.వీపనగండ్ల:- గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలో వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి ప్రవహిస్తుండగా, పంట పొలాల్ల నుంచి వచ్చిన నీరు భీమ కాలువలో చేరి వీపనగండ్ల– కాల్వరాల మధ్య బీమా కాలువ తెగిపోయి వరి పంట పొలాలకు నష్టం జరిగింది. మండలంలోని కల్వరాల గ్రామంలో మట్టి మిద్దెలు కూలిపోయాయి. ఇండ్లలో నివసించేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. కేంద్రంలోని వీపనగండ్ల వైకుంఠరెడ్డి నివాసంలో ఇంటి అడుగుభాగం నుంచి నీరు ఉబికి రావడంతో చిన్నపాటి మోటార్లను పెట్టి నీళ్లను బయటికి తోడేస్తున్నారు.
భీమ కాలువ తెగిపోవడంతో ఆ నీటి ఉధృతికి గోపాల్ దీన్నే రిజర్వాయర్ పొంగి పొర్లుతుంది. దీంతో వీపనగండ్ల– గోవర్ధనగిరి గ్రామాల మధ్య ఉన్న బిడ్జిలపై నుంచి నీరు ఎక్కి పారుతుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తుముకుట వద్ద ఉన్న ఓంకారేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. రైతులు పంట పొలాలకు సాగునీటి కోసం వాగులో వేసుకున్న మోటర్లు కొన్ని కొట్టుకుపోయినట్లు రైతులు తెలిపారు. వీపనగండ్ల గ్రామ సమీపంలోని 16వ ప్యాకేజీ బీమా కాల్వకు పలుచోట్ల గండ్లు పడ్డాయి, తాసిల్దార్ వరలక్ష్మి గోవర్ధనగిరి సమీపంలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. మట్టిమిద్దెలో నివసించకుండా, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.