ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఫాంహౌస్ లో చోరీ

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఫాంహౌస్ లో చోరీ
  • తలుపులు, అల్మారా పగులగొట్టి నగదు, నగలు చోరీ
  • ఎమ్మెల్యే స్వగ్రామం ఎలిమినేడులో ఘటన

ఇబ్రహీంపట్నం, ముద్ర: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫామ్ హౌస్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి నగదు, నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన గత 18వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 18న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈనెల 9న ఫాంహౌస్ ను శుభ్రం చేసి వెళ్లగా, తిరిగి ఈనెల 18న మరోసారి అక్కడికి వెళ్లారు. మొదటి అంతస్తు డోర్లు పగులగొట్టి ఉనాయి. బెడ్రూంలోని వస్తువులు చిందర వందరగా పడి ఉండడంతో అనుమానం వచ్చి ఫాంహౌస్ సూపర్ వైజర్ కు సమాచారం అందించారు. ఆయన వచ్చి పరిశీలించగా.. రూ.10 వేల విలువైన టైటాన్ వాచ్, అల్మారా పగులగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అయితే.. ఫాంహౌస్ లో జరిగిన చోరీ బయటకు తెలియకుండా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, ఇతర వస్తువులు చోరీ అయినట్టు సమాచారం. బయటకు తెలియకుండా తక్కువ మొత్తంలో చోరీ జరిగినట్లు చెబుతున్నట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.