బ్యాంకు దోపిడీకి దొంగల పన్నాగం

బ్యాంకు దోపిడీకి దొంగల పన్నాగం
  • లాకర్ ను కట్టర్ సహాయంతో పగులగొట్టేందుకు విపల ప్రయత్నం
  • నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న కే డి సి సి  బ్యాంకు అధికారులు

ముద్ర,ఎల్లారెడ్డిపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న కేడీసీసీ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు  దూరి లాకర్ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. కే డి సి సి బ్యాంకును ఆనుకొని మరో బిల్డింగును నిర్మాణం చేస్తున్నారు. బిల్డింగు నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన పలంచ కట్టెలపై నుండి  బ్యాంకుకు ఉన్న కిటికీలో నుండి లోపలికి దూరి ఎదురుగా ఉన్న సిసి కెమెరకు సంబంధించిన వైర్లు కట్ చేసి లోపల  ఉన్న రెండు షెటర్లను ఇనుప రాడు సహాయంతో  పైకి ఎత్తి లోనికి ప్రవేశించి  కట్టర్ తో లాకర్ను కట్ చేసే ప్రయత్నం చేయగా లాకర్ బలంగా ఉండడంతో దొంగలు చేసిన ప్రయత్నం విఫలమై ఎదురుగా ఉన్న ఫైల్స్ ను ధ్వంసం చేసి బ్యాంకు మేనేజర్ గదిలోకి ప్రవేశించి  ఫైల్స్ ను చిందర వందర చేసి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం వాచ్మెన్ అనిల్ ఎప్పటిలాగే  బ్యాంకుకు వచ్చి  గేటు తాళం తీసి లోపలికి వెళ్ళగా  రెండు షటర్లు పైకి ఎత్తి ఉండడంతో వెంటనే బ్యాంకు మేనేజర్ సంపూర్ణకు జరిగిన విషయాన్ని ఫోన్లో తెలుపగా స్పందించిన మేనేజర్ సంపూర్ణ ఎల్లారెడ్డిపేట పోలీసులకు, అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి సమాచారం అందించింది. ఎస్సై ప్రేమ్ దీప్ ఆధ్వర్యంలో క్లూస్ టీం పోలీసు జాగిలాలతో బ్యాంకు పరిసరాలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం చేతి ముద్రలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సమాచారం తెలుసుకున్న నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య  ఎల్లారెడ్డిపేట కేడీసీసీ బ్యాంకు చేరుకొని బ్యాంకు ను సందర్శించి లాకర్ రూమ్ ను పరిశీలించి జరిగిన సంఘటనను బ్యాంకు మేనేజర్ సంపూర్ణ, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డిని  అడిగి తెలుసుకున్నారు. రాత్రి వాచ్మెన్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.