ఎందరో మహనీయులకు అక్షర  పాఠాలు నేర్పింది ఈ పాఠశాలనే.

ఎందరో మహనీయులకు అక్షర  పాఠాలు నేర్పింది ఈ పాఠశాలనే.
  • 150 వసంతాలు పూర్తిచేసుకున్నమొగిలిగిద్ద పాఠశాల ”
  • ఈ సరస్వతీ నిలయం అనేక మంది జీవితాల్లో వెలుగులు  నింపింది
  • స్వర్గీయ సి‌ఎం బూర్గుల రామకృష్ణ రావు వంటి ఎందరో మహానుభావులకు నిదర్శనం 
  • వేడుకలను నిర్వహించేందుకు సిద్దమవుతున్న పూర్వ విద్యార్థులు 


ముద్ర, షాద్ నగర్:నిజాం నవాబు కాలంలో నిర్మించిన పాఠశాల 150 వసంతాలు పూర్తిచేసుకున్న సంధర్భంగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత  పాఠశాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఎంతో  చారిత్రాత్మకమైన ఈ పాఠశాలలో స్వర్గీయ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు, స్వర్గీయ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డీలతో పాటు ప్రొఫేసర్ హర గోపాల్, ఉస్మానియా మాజీరిజిస్ట్రార్ గోపాల చారి, మాజీ ఆర్డీఓ పాపయ్య వంటి ఎంతో మంది ఈ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న చరిత్ర ఈ పాఠశాలకు ఉంది. నిజాం నవాబులకు వ్యతి రేకంగా  జరుగుతున్న పోరాటంలో నాడు నిజాం నవాబు పై బాంబు వేసి తప్పించుకునే ప్రయత్నంలో తుర్రే భాజ్ ఖాన్ అనే వ్యక్తి బెంగుళూర్ వెళ్తూ మార్గ మద్యలో ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామం లో ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది. ఈ విషయాన్ని గమనించిన నిజాం నవాబులు అతడిని బందించి హైదరబాద్ కు  తీసుకువెళ్ళి  చంపినట్లు చరిత్ర ఉంది. దాంతో మొగిలి గిద్దలో వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించిన నిజాం నవాబులు పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే దిశగా పాఠశాలను ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. 1873లో మొగిలిగిద్ద గ్రామంలో నాటి నిజాం నవాబులు పరిగి రోడ్డు సమీపంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. అక్కడనే పోస్ట్ ఆఫీసు ,పోలీస్‌ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. నాడు ఏర్పాటు చేసిన పాఠశాలకు స్టానిక విద్యార్థులే కాకుండా వివిధ గ్రామాల నుండి విద్యార్థులు అక్కడికి వెళ్ళి విద్యను అభ్యసించడంతో వారిజీవితల్లో వెలుగులు వచ్చాయి. మొగిలి గిద్ద పాఠశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు దేశ, విదేశాలలో వైద్యులుగా, ఇంజనీర్లుగా అనేక రంగాలల్లో స్తిరపడ్డారు. 

ఉన్నత శిఖరాలకు చేరుకున్నమహానుభావులెంధరో...

ఏళ్ల చరిత్రకలిగిన ఈ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎందరో మహానుభావులు చేరుకున్నారు. వీరిలో హైదరాబాద్ రాష్ట్రానికి తొలి  ముఖ్యమంత్రిగా డాక్టర్ బూర్గుల రామకృష్ణరావు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ హక్కుల ఉద్యమ కారుడు ప్రొఫెసర్ హర గోపాల్ , ఉస్మానియా మాజీరిజిస్ట్రార్ గోపాల చారి, మాజీ ఆర్డీఓ పాపయ్య, వైద్యులుగా విదేశాలలో వైద్య సేవలు అందిస్తున్న బొడంపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బాలు, నాగర్ కర్నూల్  ఎమ్యెల్యే గా టి. అంజయ్య, అప్పటి ప్రభుత్వంలో విద్యా శాఖా మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ రావు, మాజీ ముఖ్య మంత్రి మర్రిచెన్నారెడ్డి తోపాటు ఎంతో మంది మొగిలిగిద్ద పాఠశాలలో విద్యాబుద్దులు నేర్చుకున్నవారే. ఇదిలావుండగా మర్రి చెన్నారెడ్డి తాను కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉండి మొగిలిగిద్దలోని పాఠశాలకు వచ్చి చదువుని సాగించారు. దాంతో మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే షాద్ నగర్ నుండి రేగడి చిల్కమర్రి గ్రామానికి ఆర్‌టి‌సి బస్సును ప్రారంభించినట్లు ప్రజలు తెలుపుతున్నారు.
150 వసంతాల వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు.

మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 ఏళ్ళుపూర్తి చేసుకున్న నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు కమిటీని సైతం ఏర్పాటు చేశారు. గౌరవ అద్యక్షులుగా జీ. శ్యాంసుందర్ , గౌరవ కార్యదర్శిగా మురళి, అద్యక్షుడిగా రాధా కృష్ణ ,కార్యదర్శిగా ఆనందీశ్వర్ రెడ్డి ,కోశాధికారిగా గంగాదర్ లను ఎన్నుకున్నారు.

క్రమశిక్షణతో  విద్యా బుద్ధులు నేర్పించారు.
బి‌జే‌పి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా.

ఉపాద్యాయులు  క్రమ శిక్షణతో  విద్యా బుద్దులు నిర్పించడంతోనే ఎంతో మంది విద్యార్థులు జీవితాల్లో వెలుగులు వచ్చాయని  బి‌జే‌పి జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్ గుప్తా తెలిపారు. ఇక్కడి విద్యార్థులు వివిద హోదాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు  నిర్వహించి పాఠశాల పేరు ప్రతిష్టలను రాష్టానికి తెలిసేలా చేశారని వివరించారు. వెనకబడిన విద్యార్థుల జీవితాల్లో  సైతం  వెలుగులు నింపి చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక పాఠశాల మొగిలిగిద్ద. 

ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ సరస్వతీ నిలయం 
ఉస్మానియా మాజీ రిజిస్టర్ గోపాల చారి 

ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాల పలువురికి ఆదర్శంగా నిలిచిందని హైదరబాద్ ఉస్మానియా మాజీ రిజిస్టర్ గోపాలచారి అన్నారు. ఈ సరస్వతీ నిలయంలో పేదవారి నుండి ధనిక కుటుంబాల వరకు విద్యను అభ్యసించారని , సమాన విద్యను ఉపాద్యాయులు అందించి ఉన్నత శిఖరాలకు చేర్చరాని తెలిపారు. 150 ఏళ్ళు పూర్తి చేసుకోవడం నాకు అంతో సంతోషంగా ఉందని వివరించారు.