నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన

నిర్మల్ జిల్లాలో హృదయ విదారక ఘటన
  • కొత్తింటి మురిపెం తీరకముందే వల్లకాటికి.....
  • ఒకే కుటుంబం లో ముగ్గురి కొడుకులని పొట్టన పెట్టుకున్న మృత్యువు ...

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ఎన్నో ఆశలతో నిర్మించుకున్న కొత్త ఇంటి తోరణాలైనా వాడలేదు..... ఇంటి ముందున్న గృహ ప్రవేశపు ఆనవాళ్లు అలాగే ఉన్నాయి. అయితే కొత్తింటి  మురిపెం తీరక ముందే వల్లకాటికి పోయిన యువకుడి హృదయ విదారక ఘటన ఇది. శుభకార్యానికి వేసిన షామియానాలు, కుర్చీలు.. అతని చివరి ప్రయాణానికి వాడాల్సిన పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన జోగు రవి(30) ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు.  ఈ నెల 6 న ఖానాపూర్ కు చేరుకున్నాడు. అప్పటికే నిర్మాణంలో ఉన్న ఇంటిని చకచకా పూర్తి చేయించాడు. తాను తిరిగి గల్ఫ్ వెళ్ళక ముందే నూతన గృహ ప్రవేశం చేద్దామని భావించాడు. చివరికి పూర్తయిన ఇంటి ప్రవేశానికి బంధువులందరికీ ఆహ్వానం పంపించాడు. ఎంతో ఆర్భాటంగా ఈ నెల 17 న గృహ ప్రవేశం జరిపారు. తన జీవితంలో అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఆనందంగా ఉన్నాడు రవి. గృహ ప్రవేశం అనంతరం బంధువులతో ఆనందంగా గడిపాడు. వారితో కలిసి భోజనం చేశాడు. భోజానంతరం అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని నిద్ర పోయాడు. అయితే నిద్రలోనే ఆయనకు గుండెపోటు రావటంతో నిద్రలోనే శాశ్వత నిద్ర పోయాడు. అప్పటి వరకు ఆనందోత్సాహాల మధ్య గడిపిన ఆ కొత్త ఇంట్లో రోదనలు మిన్నంటాయి. తాను అపురూపంగా కట్టుకున్న ఇంట్లో కనీసం కొద్ది రోజులైనా గడవక ముందే ఆయన మరణించారన్న వార్త ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. 

కుటుంబం లో ముగ్గురు కొడుకులు మృతి

కాగా రవి  మరణంతో ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న ఆయన తల్లిదండ్రులు, భార్య  సహా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. రవి అన్నదమ్ములిద్దరు కూడా గతంలో విద్యుత్‌ షాక్‌తో ఒకరు, గుండెపోటుతో మరొకరు ఇలాగే మృతి చెందారు. చివరికి రవి కూడా అదే తరహాలో మృతి చెందడం విధి శాపమేమో నని పలువురు కన్నీరు పెట్టుకున్నారు.  ముగ్గురు బిడ్డలను కళ్లముందే పోగొట్టుకున్న వృద్ధులైన తలిదండ్రులు, ఒళ్ళో పిల్లలతో భార్య  కన్నీరు మున్నీరుగా విలపించటం పలువురిని కలచివేసింది.