తిరుమల శ్రీ‌వారి భక్తులకు గుడ్​న్యూస్​.. సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్...

తిరుమల శ్రీ‌వారి భక్తులకు గుడ్​న్యూస్​.. సెప్టెంబర్​ కోటా టికెట్ల షెడ్యూల్ రిలీజ్...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను ముందుగానే ఆన్​లైన్​లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. సెప్టెంబర్​ నెలకు సంబంధించిన షెడ్యూల్​​ రిలీజ్ చేసింది.

శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు ... 

సెప్టెంబర్​ నెలకు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను జూన్​ 18న ఉదయం 10 గంట‌ల‌కు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే.. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్​ 18వ తేదీ ఉదయం 10 నుంచి జూన్​ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులకు నగదు చెల్లించిన తరువాత ఆర్జిత సేవల టికెట్లు ఖరారు అవుతాయని పేర్కొంది.

వర్చువల్ సేవ ...

కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జూన్​ 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్​ చేయనున్నట్లు పేర్కొన్నారు.

శ్రీవాణి టికెట్ల ఆన్​లైన్ కోటా ..

సెప్టెంబర్​ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారులు ఆన్​లైన్​లో విడుదల చేయనున్నారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జూన్​ 22న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు స్వామిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అదే రోజు.. మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రత్యేక దర్శన టికెట్లు...

 స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల, తిరుపతిలో సెప్టెంబర్​ నెలకు సంబంధించి గదులను జూన్​ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

అలాగే ఈ నెల 24న ఉదయం 10 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200 దర్శన టికెట్లు) జులై నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే జులైలో స్థానిక ఆలయాల సేవా కోటా బుకింగ్ టికెట్లు ఈనెల 25న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆసక్తి కలిగిన భక్తులు.. దేవస్థానం వెబ్​సైట్​ https://ttdevasthanams.ap.gov.in ద్వారా టికెట్లు బుక్​ చేసుకోవాలని కోరింది.