దార్శనికుడు పీవీ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

దార్శనికుడు పీవీ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

ముద్ర, తెలంగాణ బ్యూరో:- క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ102 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. స్థిత స్థితప్రజ్ఞతతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రదేశాల సరసన నిలిపేందుకు పునాది వేసిన దార్శనికుడని పేర్కొన్నారు. 'దేశానికి మౌనంగా మేలు చేసిన భారత ప్రధాని’ అని కొనియాడారు. పలు సంస్కరణలతో భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడిన ఘనత పీవీకే దక్కుతుందని అన్నారు. వారి స్పూర్తితో దేశాభివృద్ధి దిశగా ముందుకు సాగుతామన్నారు. 

తెలుగు ప్రజలకు గర్వ కారణం

సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన పీవీ నర్సింహారావు దేశ అత్యున్నత పదవి ప్రధాని పీఠాన్ని అధిష్టించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. దేశ ఆర్ధిక పరిస్థితి గందరగోళంలో ఉన్నప్పుడు నూతన ఆర్ధిక సంస్కరణలు చేపట్టి ఆర్ధిక సంస్కరణలకు పితామహుడయ్యారన్నారు. సంపదను సృష్టించి, అభివృద్ధికి బాటవేసి, బడుగు బలహీనవర్గాలు, రైతుల జీవితాలలో వెలుగు చూపించారన్నారు. ఆయన ప్రారంభించిన సంస్కరణలే అటల్ బిహారి వాజపేయి, మన్మోహన్ సింగ్  కొనసాగించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సంస్కరణలు ఇంకా వేగవంతం చేసి పెరుగుతున్న సంపదను పేద ప్రజలకు, రైతులకు అందిస్తున్నారని పేర్కొన్నారు.  

పీవీ బహుభాషా కోవిదుడు

పీవీ బహుభాషా కోవిదుడని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ నరసింహారావు విగ్రహం వద్ద బుధవారం ఆయన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న బిడ్డ పీవీ అని కొనియాడారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రి అయ్యారన్నారు. పీవీ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది తప్ప, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని తెలిపారు. వంగరలో పుట్టి దేశ ప్రధానమంత్రి అయ్యి.. కష్టకాలంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పీవీ నిలబెట్టారని తెలిపారు.