ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు

ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు

జర్నలిజం లో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం

సూర్యాపేట జిల్లా ఎస్పీ బి కే రాహుల్ హెగ్డే

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: ప్రపంచంలోనే శక్తివంతమైన ఆయుధం చదువు అని, మనం నిగ్రహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఏదైనా వినగలిగి, నిలబడగలిగి, గెలవగలమనే సామర్థ్యం విద్య ద్వారానే సాధ్యమవుతుందని, జర్నలిజం లో డాక్టరేట్ పొందడమే కాకుండా బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బి కే రాహుల్ హెగ్డే ప్రశంసించారు. ఇటీవల జర్నలిజం లో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా తో పాటు గోల్డ్ మెడల్ ను గవర్నర్ చేతుల మీదుగా అందుకుని అరుదైన ఘనత సాధించి సూర్యాపేట పేరును రాష్ట్రస్థాయిలో విస్తరింపజేసిన ప్రముఖ కవి, రచయిత, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణను అదనపు ఎస్పి మేక నాగేశ్వరరావు తో కలిసి శాలువా కప్పి సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యను ఆర్జించి విజ్ఞానవంతులై ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఎలాగైనా  డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించాలని నిరంతర తపన పట్టుదలతో తాను కన్న కలలను నిజం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదని, తన గోల్ రీచ్ అయ్యేవరకు నిరంతర తపన పట్టుదలతో కొనసాగడం అభినందించదగ్గ విషయం అన్నారు. అవిరళకృషి, నిరంతర సాధన ద్వారా ప్రతివారు కూడా విద్యలో అగ్ర శిఖరాలకు చేరుకోవచ్చు అని సూచించారు.  ప్రతివారు కూడా చదువుతోపాటు సంస్కారం, మానవత్వం కలిగి ఉండాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. సంపద కంటే చదువు ముఖ్యమైనదని, సంపదను నిరంతరం మనం కాపాడుకోవాల్సి వస్తుందని, చదువు మాత్రం మనల్ని  కాపాడుతుందని,
 చదువు ద్వారా సంపాదనే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయని వివరించారు.

డాక్టర్ కృష్ణ ను సన్మానించిన పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్

జర్నలిజం లో పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టాతో పాటు గోల్డ్ మెడల్ సాధించి డాక్టర్ బంటు కృష్ణ తనకే కాకుండా సూర్యాపేటకు కూడా పేరు, ప్రఖ్యాతులు తెచ్చి పెట్టడం మనందరికీ గర్వకారణం అని పద్మశాలి సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి, టైలర్స్ అసోసియేషన్ సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు దూలం నగేష్ అన్నారు. డాక్టరేట్, గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణను ఆయన ఘనంగా సన్మానించి మాట్లాడారు. తాను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడంలో బంటు కృష్ణ విజేత అయ్యాడని, సూర్యాపేట ప్రాంతానికి గోల్డ్ మెడల్ రావడం చాలా గొప్ప విషయం అని, ఇలాంటి ఘనత సాధించి సూర్యాపేట గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా చాటిన బంటు కృష్ణను  అభినందించడం ప్రతివారు బాధ్యతగా భావించాలని ఆయన కోరారు.  ఇంకా టైలర్స్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రకృతి ఒడిలో- పచ్చదనం మధ్య బంటు కృష్ణను సన్మానించిన గిరిజనులు

వారు విద్య గురించి అంతంత మాత్రమే తెలిసిన గిరిజనులు. పొద్దున లేస్తే పొలం పనులకు వెళ్లే అమాయక, శ్రామిక జీవులు. సూర్యాపేటకు చెందిన విలేఖరి డాక్టర్ బంటు కృష్ణ గోల్డ్ మెడల్ సాధించాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తుంగతుర్తి నియోజకవర్గం దోన బండ తండ, గుడి తండ గిరిజనులు కృష్ణను ఎలాగైనా సన్మానించాలని ఫోన్ చేసి తమ తండాకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  వారి ఆహ్వానాన్ని స్వాగతించి డాక్టర్ బంటు కృష్ణ దంపతులు తండాకు వెళ్లడం, ప్రకృతి ఒడిలో పచ్చని పొలాల వద్ద శాలువా కప్పి రాధాకృష్ణుల మేమంటో బహుకరించి కల్మషం లేని తమ మానవతా హృదయ తత్వాన్ని చాటుకోవడం నిజంగా జీవితంలో మరువలేని, మరపురాని ఒక గొప్ప విషయం. నిత్యం వ్యవసాయంతో తాము ఎంతో కష్టపడుతున్నామని, తమలాగా తమ పిల్లలు కూడా కష్టపడవద్దని చదివిస్తున్నామని, విద్యలో గోల్డ్ మెడల్ సాధించి అగ్ర శిఖరాలకు చేరుకొన్న డాక్టర్ కృష్ణ  తమ పిల్లలకు ఒక రోల్ మోడల్ లాగా ఉండటానికి, తమ పిల్లలను చదువులో బాగా ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని  భావోద్యోగాల మధ్య గిరిజనులు చెప్పడం, ఇంత గొప్ప అనుభూతిని కలిగించిన గిరిజనుల మమతాను రాగాలు మరువలేనివని కళ్ళు చమర్చడం మాటలకందని పరిణామం. సన్మానించడం చిన్నదైనా కావచ్చు, పెద్దదైన కావచ్చు కానీ విద్యలో గోల్డ్ మెడల్ సాధించారని, అది చాలా గొప్పదని తెలుసుకొని తమ తండాకు పిలిపించి ఆత్మీయ సత్కారం అందించిన విషయం  మాత్రం జీవితంలో మర్చిపోలేని ఓ గొప్ప సంఘటన గా అభివర్ణించవచ్చు. ఈ ఆత్మీయ ఆనంద సత్కారంలో పాత్ లోత్  ప్రవీణ్ నాయక్ -, బావ్ సింగ్, బాలాజీ నాయక్- పూలమ్మ, బానోత్ రాములు నాయక్ -, రవి నాయక్, చందు నాయక్,  సమంత, నిత్యశ్రీ, పండు, సుష్మ తదితరులు పాల్గొన్నారు.