వీధి కుక్కల దాడిలో 10 గొర్రెలు, 15 పిల్లలు మృతి

వీధి కుక్కల దాడిలో 10 గొర్రెలు, 15 పిల్లలు మృతి

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో వీధి కుక్కలు ఒక గొర్రెల పెంపకందారు బతుకును నిలువునా కూల్చేశాయి. గ్రామానికి చెందిన ఏగె చంద్రయ్యకు చెందిన గొర్రెల మందపై దాడి చేసి పది గొర్రెలు, 15 గొర్రె పిల్లలను చంపేశాయి. గొర్రెల పెంపకమే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్న చంద్రయ్య మేపు నుంచి తోలుకొచ్చిన గొర్రెలను ప్రతిరోజు దొడ్డిలో ఉంచేవాడు. మంద దగ్గర రోజు రాత్రిళ్లు కాపలాగా నిద్రించేవాడు. నిన్నను అనారోగ్యం కారణంగా ఇంట్లోనే నిద్రించాడు. రాత్రి సమయంలో వీధి కుక్కలు మందపై దాడి చేసి పది గొర్రెలు, 15 పిల్లలను చంపేశాయి.

అలాగే మరో ఆరు గొర్రెలను తీవ్రంగా గాయపరిచాయి. వీటి విలువ దాదాపు రెండున్నర లక్షల రూపాయల దాకా ఉంటుందని రోదిస్తున్నాడు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం బీబీనగర్ మండలశాఖ అధ్యక్షుడు సోము రమేష్ కురుమ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పశువైద్యురాలు డాక్టర్ ఉష, లైవ్ స్టాక్ అసిస్టెంట్ కె.సిద్ధులు వచ్చి పంచనామా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గొర్రెల కాపలాదారును ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బింగి శ్రీనివాస్, ఎస్ సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దవ్వాడి సత్యనారాయణ, కురుమ గొర్రెల మేకల పెంపకందారుల గ్రామశాఖ అధ్యక్షుడు నరాల సారయ్య, దవ్వాడి బాలమల్లేష్, పెద్ద సత్తయ్య, మంద పరమేష్ తదితరులు పాల్గొన్నారు.