జర్నలిజం ముసుగులో జనాన్ని పీడిస్తే సహించేది లేదు..
- నిజమైన జర్నలిస్టుల జోలికొస్తే ఊరుకోం
- జిల్లా జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ స్పష్టి కరణ
సిద్దిపేట,ముద్ర ప్రతినిధి : ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిజం ది కీలకపాత్ర అని సమాజంలో జరుగుతున్న మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు సమాచారం అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యత అని సిద్దిపేట ప్రెస్ క్లబ్, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు రంగచారి అన్నారు. సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జర్నలిజంలో ఇటీవల కొన్ని దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని ప్రధాన పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఒకవైపు తన పాత్ర నిర్వహిస్తుండగా రోజురోజుకు విస్తరిస్తున్న సోషల్ మీడియా కుడా మీడియా రంగంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నదని అయితే సోషల్ మీడియాలోని కొన్ని సంస్థలు, వ్యక్తులు జర్నలిజాన్ని బ్రష్టు పట్టించే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది సమాజాన్ని చెడు వైపు నడిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు . ఇది సమాజానికి, పత్రిక,మీడియా స్వేచ్ఛకు మంచిది కాదన్నారు. పత్రిక, మీడియా స్వేచ్ఛ ముసుగులో కొందరు వ్యక్తులు, సంస్థలు బరితెగించి వ్యవహరిస్తున్నారని. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యాపారులను, వివిధ సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేటు వారిని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
ఇది నిజమైన జర్నలిజం కాదు. అలాగే ఇది జర్నలిస్టులకు ఉండాల్సిన లక్షణం ఎంత మాత్రం కాదన్నారు. ఇటీవల సిద్దిపేటలో కొందరు వ్యక్తులు సంస్థలు జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడుతున్నారని. ఈ వ్యవహారాన్ని తాము జర్నలిస్టులుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారి చర్యలను తాము ఎంత మాత్రం సమర్థించ లేమన్నారు . జర్నలిజం ముసుగులో బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు, సంస్థల పట్ల ఎవరైనా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు . బెదిరింపులకు పాల్పడిన , వ్యక్తుల సమాచారాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లేదా జర్నలిస్ట్ సంఘం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా చట్ట పరమైన తీసుకునేలా చూస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు.
అదేవిధంగా జర్నలిస్టు వృత్తిని నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజంలో మంచి,చెడును బహిర్గతం చేస్తున్న నిజమైన జర్నలిస్టుల పై ఎవరు దాడులు, బెదిరింపులకు గురిచేసిన చూస్తూ ఊరుకోమని హేచ్చరించారు. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమం లో జర్నలిస్టు సంఘం నాయకులు హరిపురం రఘునందన్ స్వామి, దూది దుర్గారెడ్డి, బబ్బురి రాజు, నాయినిసంజీవరెడ్డి, మజ్జు,మాడూరి శ్రీరామ్, రంగదాంపల్లి శీను,అయిత శ్రీనివాస్,ఆకుల పాండురంగం,సాజిద్ ,రాజు, మల్లారెడ్డి, ఇంద్రశేఖర్,బాబు, భాస్కర్, జీకురుపరమేశ్వర్,రాజబాబు,రామ్ రెడ్డి, సాయి గౌడ్,అంజి, గిరి,సతీష్,నగేష్,ఎల్లయ్య,వెంకట్ మురళి, తదితరులు ఉన్నారు.