ఇంకా ఎన్ని రోజులు వంతెన  నిర్మాణం పనులు

ఇంకా ఎన్ని రోజులు వంతెన  నిర్మాణం పనులు
  • ఐదు సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇక్కట్లు

ముద్ర. వీపనగండ్ల:- అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన వంతెన ( బ్రిడ్జి) నిర్మాణ పనుల వల్ల తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రావటం లేదని గోపాల్ దీన్నే వీపనగండ్ల గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఏడు సంవత్సరాల క్రితం సుమారు 22 కోట్ల రూపాయలతో తూముకుంట నుంచి వీపనగండ్ల మీదుగా గోవర్ధనగిరి వరకు బీటి డబుల్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టగా ఇప్పటికీ పనులు నత్త నడకనే కొనసాగుతున్నాయి.2016 సంవత్సరంలో ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయగా ప్రభుత్వాలు పాలకులు మారిన ఇప్పటికీ పనులు నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్ ఈ రోడ్డు వెంట పలుచోట్ల వంతెన,కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, కొన్నిచోట్ల కల్వర్టు పనులు పూర్తిగా గాక మరికొన్నిచోట్ల వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిర్మించి వదిలివేయగా, మరికొన్నిచోట్ల కల్వర్టు పనులను మొదలు పెట్టలేదు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా మారాయని వాహనదారులు వాపోతున్నారు, వీపనగండ్ల నుంచి గోవర్ధనగిరి వరకు ఎనిమిది కిలోమీటర్ల బీటి రోడ్డు నిర్మాణ పనులు పూర్తికాగా మూడు చోట్ల వంతెన పనులు ఇంకా నత్తనడగానే కొనసాగుతున్నాయి.

గోవర్ధనగిరికి సమీపంలో మూడు సంవత్సరాలుగా వంతెన బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.బ్రిడ్జి నిర్మించిన  డ్రైవర్సన్  రోడ్డు సరిగా లేకపోవడంతో బస్సులు లారీలు వంటి భారీ వాహనాలు రావటానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రహదారినైనా బాగు చేసి ఉంటే ఆర్టీసీ బస్సులు తిరగడానికి వీలుండేదని గోపాల్ దీన్నే వీపనగండ్ల గ్రామాల ప్రజలు అంటున్నారు. అంతేకాక గోవర్ధనగిరి కొత్తచెరువు వద్దా కల్వర్టు నిర్మాణానికి సిమెంట్ పైపులను తెచ్చి దిష్టిబొమ్మల ఉంచి వెళ్లిపోయారని, గోపాల్ దిన్నె క్రాస్ రోడ్ వద్ద నిర్మించిన పైపులైన్ బ్రిడ్జి నిర్మాణం పై సైడ్ వాల్స్ లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.తూముకుంట–వీపనగండ్ల బీటి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి,వంతెన ( బ్రిడ్జి) నిర్మాణం పనులను కూడా పూర్తయ్యేలా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని, పెబ్బేరు నుండి గోవర్ధనగిరి గోపాల్ దిన్నె గ్రామాల మీదుగా కొల్లాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.